రజినీ ముందుకా? వెనక్కా ?

రజినీ ముందుకా?  వెనక్కా ?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా అంటూ క్రిస్మస్ రోజున ఓ వార్త హల్ చల్ చేసింది. తరువాత ఆయనకు హైబీపీ అన్నారు. ఏమైనా రజనీకాంత్ డిసెంబర్ 25న  హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్  అపోలో ఆసుపత్రిలో చేరారు. దాంతో రజనీకాంత్ అభిమానుల మదిలో ఆందోళన చోటు చేసుకుంది. రజనీకాంత్ తాజా చిత్రం 'అన్నాతే' షూటింగ్ నిమిత్తమై ఆయన కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. షూటింగ్ టీమ్ లోని నలుగురికి కరోనా సోకడంతో చిత్రీకరణ ఆపు చేశారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ కూ కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వినిపించింది. ఏది ఏమైనా రజనీకాంత్  హై బీపీ కారణంగానే ఆసుపత్రిలో చేరారని నిర్ధారించారు. 

రాజకీయ కోణంలో...
ఈ విషయాన్నంతా పరిశీలిస్తే, రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ముందు ఇదో పొలిటికల్ స్టంట్ అంటూ కొందరు అంటున్నారు. ఈ నెల 12తో రజనీకాంత్ 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తన పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందే ఆయన తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. తన పార్టీని 2021 జనవరిలో ప్రకటిస్తాననీ ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జనాల్లో సానుభూతి కోసమే రజనీకాంత్ ఈ ఆసుపత్రి డ్రామాకు తెరతీశారని కొందరి మాట.  రజనీకాంత్ రాజకీయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనయ్యారని మరికొందరు అంటున్నారు. రాబోయే జనవరిలోనే రాజకీయ ప్రవేశం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి అన్న అంశంపై తీవ్రంగా ఆలోచించడం వల్లే ఆయన రక్తపోటు పెరిగిందని చెబుతున్నారు.  పైగా జనవరిలో పార్టీ  ప్రకటిస్తే, మే నెలలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నాలుగు నెలల సమయంలోనే తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం వీలవుతుందా అన్న ఆందోళన కూడా ఆయనలో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఒత్తిడికి గురవ్వడం వల్ల బీపీ పెరిగిందని సమాచారం. ఆరోగ్యం సహకరించడం లేదు అంటూ తన రాజకీయ అరంగేట్రాన్ని రజనీ వాయిదా వేసుకొనే వీలూ ఉందనీ కొందరి మాట. 

అలా అయితే ఇలా... ఇలాగయితే అలా...
భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ ఏమి చేసినా అది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఒకవేళ ఆయన జనవరిలో పార్టీ ప్రారంభిస్తే, క్రిస్మస్ రోజున హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయినది సానుభూతి కోసం ఆడిన నాటకం అంటారు. లేదా ఆయన అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రానూ అంటే, అందుకూ ఈ డ్రామా పనిచేసిందనీ చెబుతారు. ఏది ఏమైనా రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడం వెనుక రాజకీయ కోణమే ఉందని వినిపిస్తోంది. మరి రజనీకాంత్ రాజకీయాలవైపుకే అడుగు వేస్తారా? లేక ఒత్తిడి తట్టుకోలేక విరమించుకుంటారా? చూద్దాం ఏమవుతుందో?