ఆ దీక్షకు సీతక్క, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాలేదు..?

ఆ దీక్షకు సీతక్క, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాలేదు..?

అందరూ కలిసి ఉద్యమించాలని అనుకున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు. కానీ బృందగానం మిస్‌ అయింది. ఆ ముగ్గురు హాజరు కాలేదు. ఇంతకీ ఎవరు వారు? ఎందుకు రాలేదు? ఆ ఒక్క కారణం వల్లే దూరంగా ఉన్నారా? కాంగ్రెస్‌లో ఐక్యత ఎండమావేనా? 

దీక్షకు రాని ఎమ్మెల్యేలు, ఎంపీ!

రైతుల సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్‌  ఫోకస్‌ పెట్టింది. కేంద్రం తెచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూనే.. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను నిరసిస్తూ ఉద్యమిస్తున్నారు నాయకులు. రైతులకు మేమున్నాం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా వివిధ రకాల ఆందోళనలకు ప్రణాళికలు వేస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన నాయకులు హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో ఒకరోజు దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బృందంగా నిరసన చేపట్టాలని అనుకున్నారు. చాలా రోజుల తర్వాత చేపట్టిన ఉద్యమం కావడంతో పార్టీ నేతలంతా హుషారుగా వచ్చినా.. ఎమ్మెల్యేలు సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు. పార్టీ దీక్షకు జనాల్లో వచ్చిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. ఈ ముగ్గురి గైర్హాజరుపై కాంగ్రెస్‌లో జరుగుతోన్న చర్చ మరో ఎత్తు. 

దీక్షకు రేవంత్‌ వచ్చి ఎమ్మెల్యే సీతక్క ఎందుకు రాలేదు?

సీఎల్పీ నేత తనను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సీతక్క బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఇద్దరికీ మొదటి నుంచి పడటం లేదని చెబుతారు. అసెంబ్లీ సమావేశాల్లో అంతా కలిసే ఉంటారు కానీ.. ఆమె ఎంపీ రేవంత్‌రెడ్డివర్గానికి చెందిన మనిషిగా ముద్ర ఉంది. రేవంత్‌ వర్గానికి చెందిన మనిషినే అయినా ఎమ్మెల్యేగా తన అభిప్రాయానికి విలువ ఇవ్వాలని కాదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తన అభిప్రాయం నచ్చకపోతే దూరం పెట్టినా బాగుండేది అని కుండబద్దలు కొట్టేస్తున్నారు.  ఇప్పుడు దీక్షకు రాకపోవడానికి కారణం కూడా అదేనని అనుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. మరి.. రేవంత్‌ వచ్చి  సీతక్క రాకపోవడం ఏంటన్నది కొందరి ప్రశ్న. 

బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం ఇష్టం లేక రాజగోపాల్‌రెడ్డి రాలేదా?

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. సీఎల్పీ నేత భట్టివిక్రమార్కకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారామే  CLPలో కొంత కన్ఫ్యూజన్‌ ఉందట. సీఎల్పీ  సమావేశాలకు వస్తున్నా.. అసెంబ్లీ సమావేశాల్లో కలిసే సాగుతున్నా.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం పాత పాటను వదలడం లేదు. ఈ మధ్యే బీజేపీలోకి వెళ్తానని చెప్పేశారు. అందుకే దీక్షకు రాలేదని అనుకుంటున్నారు. నిరసన కార్యక్రమానికి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది అనుకున్నారో ఏమో ఎవరికీ అందుబాటులో లేకుండా కామైపోయారు. తమ్ముడు లైన్‌ అందరికీ తెలిసిందే అయినా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు ఎందుకు  రాలేదన్నది ప్రశ్న. పీసీసీ కొత్త చీఫ్‌ ఎంపిక విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నారా? అందువల్లే రాలేదా అన్నది కూడా చర్చ జరుగుతోంది. 

తెలంగాణ కాంగ్రెస్‌లో బృందగానం మిస్‌?

ఇప్పటికైతే పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ ఆగింది. ఎప్పటిలా నాయకులంతా కలిసి సాగుదామనే ప్రయత్నంలో ఉన్నారు. బృందగానం వినిపించాలని భావించినా.. అది మిస్‌ అయింది. ఉన్నదే ఆరుగురు ఎమ్మెల్యేలు.. కారణం ఏదైనా అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ డుమ్మా కొట్టడంపై చర్చ అయితే ఆగడం లేదు. అంతేకాదు... కాంగ్రెస్‌లో ఐక్యత ఎండమావే అన్న నానుడీ మరోసారి రుజువైందనే కామెంట్స్‌ బలంగా వినిపిస్తున్నాయి.