100కు పైగా స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీకి స్టార్ క్యాంపైనర్లు ఎక్కడ?
గ్రేటర్ ఎన్నికల్లో వందకుపైగా స్థానాల్లో పోటీ చేస్తోన్న టీడీపీ ప్రచారంలో 'స్టార్' మెరుపుల్లేవా? చంద్రబాబు, లోకేష్, బాలయ్యలు ప్రచారానికి వస్తారని భావించినా.. అటువంటి సందడే లేదా? ఒకప్పుడు GHMC ఎన్నికలంటే సిటీలో వాలిపోయే ఏపీ టీడీపీ నేతలు ఇప్పుడెందుకు దూరంగా ఉన్నారు?
గ్రేటర్లో 106 డివిజన్లలో టీడీపీ పోటీ!
ఒకప్పుడు హైదరాబాద్ మేయర్ స్థానాన్ని కైవశం చేసుకున్న టీడీపీ... ఇప్పుడు తెలంగాణలోనూ.. గ్రేటర్ సిటీలోనూ ఉనికి చాటుకునే పనిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం నుంచి బయటపడేందుకు GHMC ఎన్నికలను ఒక ప్లాట్‌ఫామ్‌గా భావిస్తున్నారు టీడీపీ నేతలు. చాలా ఏళ్ల తర్వాత గ్రేటర్ బరిలో ఒంటరిగా దిగిన టీడీపీ 106 స్థానాల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ మ్యానిఫెస్టో విడుదల వరకు అంతా తెలంగాణ టీడీపీ నాయకుల పర్యవేక్షణలోనే సాగింది. తెర వెనక చంద్రబాబు మంత్రంగం నడిపినా ఎక్కడా ఆ మాట బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు స్థానిక నాయకులు.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ ప్రచారం!
ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో తెలంగాణ నాయకులే పాల్గొంటున్నారు తప్ప.. చంద్రబాబు, లోకేష్, బాలయ్యల ఊసే వినిపించడం లేదు. ఈ ముగ్గురు నాయకులు తప్పకుండా వస్తారని.. టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారని భావించారు తెలుగు తమ్ముళ్లు. ప్రచారం ముగింపు గడువు సమీపిస్తున్నా.. వారు వస్తారన్న జాడ లేదు. గత GHMC ఎన్నికల్లో చంద్రబాబు, నారా లోకేష్‌లు కాలికి బలపం కట్టుకున్నట్టుగా సిటీని చుట్టేశారు. బహిరంగ సభలు పెట్టారు. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక్క కార్పొరేటరే గెలిచారు. ఇప్పుడు అంతకు మించిన ఆశలు పెట్టుకున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఈ దఫా ఏపీ టీడీపీ నేతలు ప్రచారానికి రావడం లేదు?
GHMC ఎన్నికలు అంటే.. ఏపీ టీడీపీ నేతలు కూడా ఎంతో ఆసక్తి చూపించేవారు. ఎన్నికలయ్యే వరకు సిటీలోనే ఉండి ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. గల్లీ గల్లీల్లో తిరిగి ప్రచారం చేసేవారు ఏపీ టీడీపీ నాయకులు. ఇప్పుడు వారి ఆచూకీ కూడా లేదు. ఏపీ నుంచి ఈ దఫా టీడీపీ నేతలు ప్రచారానికి రావడం లేదట. అలా వస్తే ప్రత్యర్థి పార్టీలు టీడీపీపై ఆంధ్ర అనే ముద్ర వేస్తాయని అనుమానిస్తున్నారట. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఇదే జరిగిందని.. అందుకే GHMC ఎన్నికల్లో అలాంటిది రిపీట్ కాకుండా చూస్తున్నారని సమాచారం.
స్టార్ క్యాంపెయినర్లు లేకుండానే టీడీపీ ప్రచారం!
మొత్తానికి ఈ దఫా GHMC ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్ల హడావిడి లేకుండానే ప్రచారం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయట. తెలంగాణలోని టీడీపీ మొత్తం స్థానిక నేతల ఆధ్వర్యంలోనే నడుస్తుందని.. వారికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. దీంతో బరిలో ఉన్న 106 మంది టీడీపీ అభ్యర్థులు తమ సొంత బలంపైనే అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. మరి.. ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)