ప్రభుత్వానికి, టీచర్లకు గ్యాప్ వచ్చిందా...?

ప్రభుత్వానికి, టీచర్లకు గ్యాప్ వచ్చిందా...?

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు కానీ.. ఆ చిత్రంలో టీచర్‌ సంఘాల నాయకులు లేరు. ఈ అంశంపై ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ తెర వెనక ఏం జరిగింది? లెట్స్‌ వాచ్‌!

టీచర్‌ యూనియన్లకు ఆహ్వానం లేదా?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా నెలల తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంపై కొత్త చర్చ మొదలైంది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఇటీవల ప్రకటించిన వరాలపై TNGO, TGO నాయకులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి సీఎం భోజనం చేశారు కూడా. కానీ ఈ సమావేశానికి ఉపాధ్యాయ సంఘాల వారు హాజరు కాలేదు.  వారికి ఆహ్వానం కూడా లేకపోవడం చర్చగా మారింది. 

మిగతా ఉద్యోగ సంఘాలతో టీచర్‌ యూనియన్లకు గ్యాప్‌!

గతంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలిసినప్పుడు కూడా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను పిలవ లేదు. ప్రభుత్వానికి టీచర్ల సంఘాలకు మధ్య కొంతకాలంగా గ్యాప్‌ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఆయా సంఘాల ప్రతినిధులపై గుర్రుగా ఉన్నారట. అలాగే మిగతా ఉద్యోగ సంఘాలతోనూ టీచర్ల యూనియన్లకు అస్సలు పొసగడం లేదని సమాచారం. హైదరాబాద్‌ వరద సాయానికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ జాక్‌ నిర్ణయించినప్పుడు టీచర్ల సంఘాలు వ్యతిరేకించాయి. వాళ్ల జీతంలో ఒక రోజు వేతనాన్ని కట్‌ కాకుండా చూసుకున్నారు. అప్పటికే ఉన్న గ్యాప్‌ .. ఈ ఘటన తర్వాత మరింత దూరం పెరిగిందట. 

టీచర్ల డిమాండ్స్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదా?

పీఆర్సీ ప్రకటించాలని, ప్రమోషన్లు కల్పించాలని, బదిలీలకు ఓకే చెప్పాలనే డిమాండ్స్‌పై కొంతకాలంగా టీచర్‌ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  తీవ్ర విమర్శలే చేశారు యూనియన్ల నాయకులు. ప్రభుత్వం కూడా వారి విషయంలో అంటీ ముట్టనట్టే ఉంటోంది. చివరకు మొన్న జరిగిన GHMC ఎన్నికల్లో సైతం ఉపాధ్యాయులకు ఎలక్షన్‌ డ్యూటీ వేయలేదు. దీంతో వారి డిమాండ్స్‌ను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

ఎవరిని పిలిచారని ఆరా తీసిన నాయకులు!

ఇలాంటి సమయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతున్నారని  వార్తలు రావడంతో ఎవరెవరిని ఆహ్వానించారనే దానిపై టీచర్ల యూనియన్లు ఆరా తీశాయట. తమకు ఆహ్వానం ఉందా లేదా.. ఉంటే తమలోని ఏ సంఘాలను పిలిచారు అన్న దానిపై వాకబు చేశారట నాయకులు. చివరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎవరికీ ఆహ్వానం లేదని తెలిసి ఉసూరుమన్నారట. తమను ఎందుకు పిలవలేదు. తాము ప్రభుత్వంలో భాగం కాదా అని లోలోన మదన పడుతున్నారట. 

కొత్త డైరీ ఆవిష్కరణ కోసమే కలిశారట!

జరుగుతున్న పరిణామాలపై విభజించి పాలిస్తున్నారని టీచర్‌ యూనియన్‌ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట. తమను ప్రతిసారీ అవమానిస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. అయితే  ఏ ఉద్యోగ సంఘాన్ని CMO అధికారికంగా పిలవలేదనే ప్రచారం జరుగుతోంది. కొన్ని యూనియన్ల వారు నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కోసం టైమ్‌ అడిగితే సీఎం ఓకే చెప్పారని.. ఈ మీటింగ్‌ అందుకే తప్ప ఉద్యోగ సమస్యలపై చర్చించేదుకు కాదని చెబుతున్నారట. ఇప్పటి వరకు టీచర్ల యూనియన్లు ఏవీ దీనిపై బహిరంగంగా స్పందించలేదు. మరి స్పందిస్తాయో లేదో చూడాలి.