తెలంగాణ నేతలను ఊరిస్తున్న పదవులు..

తెలంగాణ నేతలను ఊరిస్తున్న పదవులు..

తెలంగాణలో అధికారపార్టీ నేతలను 4 నెలలుగా మూడు పదవులు ఊరిస్తున్నాయి. అవి ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. అదిగో ఇదిగో అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అనేకమంది పేర్లు చర్చలోకి వచ్చాయి. ఇంతకీ అధినేత ఆలోచన ఏంటి? సమీకరణాల పేరుతో ఎలాంటి కసరత్తు జరుగుతోంది?

ఎవరికి ఛాన్స్‌ ఉంటుందో బయటపెట్టని పార్టీ!

తెలంగాణ శాసనమండలిలో గవర్నర్‌ కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు నెల నుంచే వీటిపై టీఆర్‌ఎస్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆశావహులు. కొందరు  నేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఎమ్మెల్సీని చేయాలని కోరారు. మరికొందరు కేటీఆర్‌ను కలిసి తమ మనసులో మాట వెల్లడించారు. అయితే ఎవరికి ఛాన్స్‌ ఇస్తున్నారన్న విషయంలో పార్టీ అధిష్ఠానం ఎక్కడా బయటపడలేదు. 

కర్నెకు అధిష్ఠానం హామీ దక్కిందని ప్రచారం!

ముఖ్యమంత్రి OSD దేశపతి శ్రీనివాస్‌, మొన్ననే ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిన కర్నె ప్రభాకర్‌, గోరటి వెంకన్నల పేర్లు అదే పనిగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ముగ్గురిలో దేశపతి, గోరటి పేర్లు బలంగానే వినిపిస్తున్నా.. మరోసారి ఛాన్స్‌ ఇవ్వాలని కర్నె కోరుతున్నారు. అధినేతల ప్రసన్నం కోసం  పడరాని పాట్లు పడుతున్నారట. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కర్నెకు ప్రభుత్వ విప్‌గా కూడా అవకాశం ఇచ్చారు. అయితే మళ్లీ ఆయన్ని పిలిచి ఎమ్మెల్సీని చేస్తారా లేదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉందట. పార్టీలోని మరో వర్గం మాత్రం కర్నెకు అధిష్ఠానం నుంచి హామీ దక్కిందనే ప్రచారం మొదలుపెట్టింది. 

కొత్తవారిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదా? 

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి ఉన్నారు.  అలా హామీలు పొందిన వారిలో ఎవరిని ఎంపిక చేస్తారో.. ఎవరికి పిలుపు వస్తుందో అంతుచిక్కడం లేదట. ఈ మూడు సీట్ల విషయంలో టీఆర్‌ఎస్‌ అధినేత వడపోతలేంటనేదీ ఉత్కంఠగా మారినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్నవారు కాకుండా కొత్తవారిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది తెలంగాణ భవన్‌ నుంచి వినిపిస్తున్న మాట. 

దుబ్బాక ఉపఎన్నిక  తర్వాత ప్రకటన ఉంటుందా?

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ దృష్టి అంతా దుబ్బాక ఉప ఎన్నికపై ఉంది. ఇదే సమయంలో GHMCపైనా కన్నేసింది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపైనా ఫోకస్‌ పెట్టారు గులాబీ నేతలు. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై ప్రకటన ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.