కళ్యాణమస్తు టీటీడీకి భారంగా మారుతుందా ?

కళ్యాణమస్తు టీటీడీకి భారంగా మారుతుందా ?

కల్యాణమస్తు... టిటిడి ప్రతిష్టాత్మకంగా పదేళ్ల క్రితం నిర్వహించిన కార్యక్రమం. దీనిపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇందులో లబ్దిదారులు ఇతర మతాల వారు కూడా ఉన్నారనే కామెంట్స్‌ వినిపించాయి. గతంలో ఎదురైన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారా? కోవిడ్ కారణంగా  తగ్గిన ఆదాయంతో ఈ ప్రాజెక్టుని మళ్లీ నిర్వహించగలరా? 

కల్యాణమస్తు లోపాలు సరిద్దారా? మళ్లీ పక్కదారి పడుతుందా? టిటిడికి ఆర్థికంగా భారమవుతుందా?

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల.  శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ప్రపంచవ్యాప్తంగా తరలివస్తుంటారు. స్వామివారికి ఏడాదికి రూ.2 వేల కోట్ల వరకు కానుకలు వస్తుంటాయి. టిటిడి ఏటా రూ.200 కోట్ల రూపాయలను వెచ్చించి హిందు ధార్మిక ప్రచారం నిర్వహిస్తుంది. అందులో భాగంగా 2007లో టిటిడి అట్టహాసంగా కళ్యాణమస్తు  కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ  కార్యక్రమాన్ని గతంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. 

కల్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా, పెళ్ళి చెసుకునే జంటలకు 2 గ్రాముల బంగారంతో మంగళసూత్రాలతో పాటు వస్ర్తాలను ఉచితంగా అందజేసింది. వధూవరులుతో పాటు 50 మందికి ఉచితంగా భోజనం సరఫరా చేసింది టిటిడి. ఇలా ఒక్క జంట వివాహానికి 8 వేల రూపాయలు వరకు ఖర్చు చేసిది టిటిడి. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ధపా ఐదు వేల నుంచి 7 వేల వరకు జంటలు పాల్గొనేవి. ఏడు విడతలుగా నిర్వహించిన ఈ పథకానికి ఏటా టిటిడి రూ.18 కోట్ల వరకు వెచ్చించింది టిటిడి. 

2011 వరకు ప్రతి ఏటా రెండు విడతల్లో కల్యాణమస్తు కార్యక్రమాన్నినిర్వహించింది టిటిడి. అప్పటి విజిలెన్స్ అధికారుల నివేదిక ఈ కార్యక్రమం ఎలా దారి తప్పిందో చెప్పింది. హిందు దార్మిక ప్రచారంలో భాగంగా కల్యాణమస్తు నిర్వహిస్తున్నారు. పేదవారైన హిందువులకు వివాహం జరిపించటం దీని ఉద్యేశం. కానీ, ఇందులో 90 శాతం మంది ఇతర మతస్థులు పాల్గొంటున్నారని తేల్చేసింది. పైగా వృద్ధులు కూడా కొందరు పెళ్లి చేసుకుంటున్నారని తేల్చింది. ఇదంతా నిధులను పక్కదారిపట్టించటమే అని నివేదిక చెప్తున్న సారాంశం. 

అంతేకాదు...పెళ్లి సందర్భంగా భోజనం పేరుతో చేసే ఖర్చులో టిటిడి ఉద్యోగులు నిధులను భోంచేస్తూన్నారని కూడా విజిలెన్స్ నివేదిక చెప్పింది. అప్పటి ఇఓ క్రిష్ణారావు కి 2011 మార్చిలో ఈ నివేదిక అందింది. నిర్ణయం తీసుకునే లోపే....క్రిష్ణారావు బదిలి అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన ఎల్వీ సుబ్రమణ్యం ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత 2013లో ఈ కార్యక్రమాన్ని తిరుమలలోనే నిర్వహించాలని బాపిరాజు హయాంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పటి పాలకమండలి నిర్ణయం తీసుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఇది అంతిమంగా, టిటిడికి ఆర్దికంగా భారంగా మారుతుందని భావించిన అధికారులు పథకాన్ని వాయిదా వేసేసారు. 

తిరిగి ఇప్పుడు టిటిడి పాలకమండలి కళ్యాణమస్తు  కార్యక్రమాన్నితిరిగి ప్రారంభించాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. బంగారం రేట్లు పెరగటంతో రెండు గ్రాముల బంగారు మంగళసూత్రానికి రూ.10 వేల పైనే ఖర్చవుతుంది. గతంలో లాగా టిటిడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే టిటిడికి జంటకి  రూ.15 వేల వరకు  ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఖర్చు చేసే సంగతి ఎలా ఉన్నా, నిధులు పక్కదారి పట్టకుండా కట్టడి చేసేదెలా అనేదే ప్రశ్న. పైగా నిధులు ఎలా సమకూరుస్తుందనేది కూడా ప్రశ్నార్థకమే.  హిందు ధార్మిక ప్రచారం కోసం పునః ప్రారంభిస్తున్న కళ్యాణమస్తు  కార్యక్రమానికి టిటిడి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో మరి..