వారసున్ని బరిలో దించేందుకు ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కసరత్తు !

వారసున్ని బరిలో దించేందుకు ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కసరత్తు !

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉందట ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు అనుచరులు సైతం ఓ రేంజ్‌లో తమ నేత గురించి ప్రచారం చేస్తున్నారు. కాబోయే డిప్యూటీ సీఎం అని ఓరుగల్లు రాజకీయాల్లో ఊదరగొడుతున్నారు. వారసుడు వచ్చేస్తాడని చెబుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన లెక్కలేంటి? 

కాబోయే డిప్యూటీ సీఎం అని అనుచరుల ప్రచారం!

ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చలకు కేంద్ర బిందువయ్యారు డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌. ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారం మాములుగా లేదు. తమ నేత రెడ్యా నాయక్‌ డిప్యూటీ సీఎం అవుతారని ఓ రేంజ్‌లో ప్రచారం చేస్తున్నారట. ఇటీవల డోర్నకల్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రెడ్యానాయక్‌.. కాబోయే సీఎం కేటీఆర్‌ అని కామెంట్‌ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అనుచరులు ఆ ప్రచారానికి మరో రెండు తగిలించి కేటీఆర్‌ కేబినెట్‌లో ఎవరెవరు ఉండబోతున్నారో చెబుతున్నారట. ఆ విధంగా తమ నేత రెడ్యానాయక్‌కు డిప్యూటీ సీంఎ పదవి వచ్చేస్తుందని తెగ సంబరపడుతున్నారు. 

కుమారుడి కోసం లైన్‌ క్లియర్‌ చేస్తున్నారా? 

తన కుమార్తెను ఆదిరించినట్టుగానే కుమారుడు రవిచంద్రను కూడా ఆశీర్వదించాలని కోరుతున్నారు రెడ్యానాయక్‌. మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్ కవిత.. రెడ్యానాయక్‌ కుమార్తె. ఆమె గతంలో ఎమ్మెల్యేగానూ పనిచేశారు. ఇప్పుడు సడెన్‌గా కుమారుడు పేరు ప్రస్తావించడంతో డోర్నకల్‌ నుంచి రవిచంద్రే బరిలో ఉంటారని చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు.. మంత్రి పదవిపైనా ఆయన ఆశలు పెట్టుకున్నారట. పైగా ఇవే తన చివరి ఎన్నికలని సెంటిమెంట్‌ పండిస్తున్నారు నాయక్‌ సాబ్‌. 

ఒకదాని వెనక ఒకటిగా కథనాలు అల్లేస్తున్నారా?

డోర్నకల్‌ అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులకు బీజేపీ వల విసురుతోంది. ఈ వలకు పార్టీ నేతలతోపాటు రెడ్యా నాయక్‌ కూడా చిక్కారని ప్రచారం జరగడంతో.. ఆయన్ని పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడినట్టు చెబుతున్నారు. మంచి అవకాశం ఇస్తాం.. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని హామీ ఇచ్చారట. ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి రకరకాల కథనాలు అల్లేస్తున్నారట ఎమ్మెల్యే అనుచరులు. జిల్లా నుంచి ఎస్టీ కోటాలో మంత్రిగా సత్యవతి రాథోడ్‌ ఉన్నారు.  మరి.. రెడ్యానాయక్‌కు ఎలా అవకాశం ఇస్తారన్నది పార్టీ నేతల ప్రశ్న. అయితే కుమారుడి రాజకీయ భవిష్యత్‌కు లైన్‌ క్లియర్‌ చేయడం కోసమే పావులు కదుపుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఒకవేళ తాను మంత్రిని కాకపోయినా.. కనీసం తన కుమారుడిని అయినా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేను చేస్తారని  లెక్కలు వేసుకుని ఉంటారని అనుకుంటున్నారు. మొత్తానికి ఆలు లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టుగా ఉందట రెడ్యానాయక్‌ విషయంలో జరుగుతున్న ప్రచారం.