ఉప్పు నిప్పుగా మారిన వరంగల్ తెరాస రాజకీయం...
వరంగల్ తూర్పులో అధికార పార్టీ నేతల లడాయి రోజుకో మలుపు తిరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యేకి మంత్రి సోదరుడికి అస్సలు పడటం లేదు. ఉప్పు నిప్పుగా మారిపోయింది తూర్పు రాజకీయం. వీరి మధ్య ప్రభుత్వ అధికారులు.. పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
వరంగల్ తూర్పులో నరేందర్ వర్సెస్ ప్రదీప్‌రావు!
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోజు రోజుకు గ్రూపు రాజకీయలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల సమయానికి ఇక్కడ రెండు గ్రూపులే ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంతో రెండు గ్రూపులు నాలుగయ్యాయి. గతంలో ఇక్కడ కొండా దంపతులు.. అప్పట్లో మేయర్‌గా ఉన్న నన్నపనేని నరేందర్ మధ్య వార్ నడిచేది. ఇప్పుడు నరేందర్ ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలు మరిన్ని మలుపు తీసుకున్నాయని చెబుతారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు ఎమ్మెల్యే నరేందర్ మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్లో సాగుతోంది. వీరి అనుచరుల మధ్య నిత్యం తగువే. చేతికి ఏది దొరికితే దానిని పట్టుకుని కొట్టేసుకుంటున్నారు.
నిత్యం కయ్యానికి కాలు దువ్వుతున్నారా?
ఒకవైపు వరంగల్‌లో బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తిరిగి పట్టు సాధించేందుకు కొండా దంపతులు కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తున్నారు. ఇలాంటి సమయంలో తూర్పు నియోజకవర్గంలో సమన్వయంతో కదలాల్సిన టీఆర్ఎస్ నాయకులు కయ్యానికి కాలు దువ్వడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట. అంతేకాదు.. ప్రదీప్‌రావు, నరేందర్ వర్గాల మధ్య గొడవలో పోలీసులు సైతం నలిగిపోతున్నారట. ఎవరి పక్షాన మొగ్గు చూపితే ఏమౌతుందోనని ఆందోళన చెందుతున్నారట. ఎమ్మెల్యే మాట వినకపోతే ఒక తంటా.. మంత్రి తమ్ముడు మాటకు విలువిస్తే ఇంకో తంట అన్నట్టుగా ఉందట.
ఆధిపత్య పోరులో వెనక్కి తగ్గని నాయకులు!
బస్వరాజు సారయ్య ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన వర్గం కూడా తూర్పులో యాక్టివ్ అయిందట. దీంతో తూర్పు టీఆర్ఎస్లో మూడు ముక్కలాట పంచాయితీ రోడ్డున పడుతోంది. సారయ్యను కాబోయే మంత్రి అని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆయన మాటను కాదనలేక ఇబ్బంది పడుతున్నారట. అయితే ప్రదీప్‌రావు, నరేందర్ మధ్య వెలుగు చూస్తున్న తగువే ఎక్కువ తలనొప్పిగా మారుతున్నట్టు సమాచారం. ప్రదీప్‌రావు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అలా అని ఆయన టీఆర్ఎస్కు ఇంకా గుడ్‌బై చెప్పలేదు. అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. పైగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు. బలమైన అనుచరగణం ఉన్న నాయకులు కావడంతో ఆధిపత్య పోరులో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మరి..రోడ్డున పడ్డ ఈ వర్గపోరుకు పార్టీ పెద్దలు ఎలాంటి కాయకల్ప చికిత్స చేస్తారో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)