వ్యూహం లేకుండా గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్...

వ్యూహం లేకుండా గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్...

సిపాయిలు లేకుండా యుద్ధం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటోందా? గ్రేటర్‌ ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్స్‌ ఏంటి? పోటీ చేస్తే సరిపోతుందా.. ఎలక్షన్‌ వ్యూహం ఉండదా? కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? 

కాంగ్రెస్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందడి లేదా?

ఎన్నికలంటే ఎంతో కసరత్తు.. వ్యూహాలు... ఎత్తుగడలు ఉంటాయి. వరుస ఓటములతో కుదేలైందో ఏమో కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో అవన్నీ మర్చిపోయారనే కామెంట్స్‌ బలంగా వినిపిస్తున్నాయి. GHMC ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.. నేతల్లో చీమకుట్టినట్టు అయినా లేదట. ఒకప్పుడు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌దే రాజ్యం అన్నట్లు ఉండేది.  ఇప్పుడు ఆ సందడే లేదు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి అన్నట్లు నాయకుల వైఖరి ఉందని గుసగుసలాడుకుంటున్నారు. 

అభ్యర్థులను ఎంపిక చేస్తే సరిపోతుందనే ఆలోచనలో ఉన్నారా? 

గత GHMC ఎన్నికలలో చేసిన పొరపాట్లే కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ చేస్తుందన్నది ఆ పార్టీ నేతల వాదన. ఉన్న వారిని సమన్వయ పరిచే పరిస్థితి కానరావడం లేదట. షెడ్యూల్‌ వచ్చాక అభ్యర్థులను ఎంపిక చేస్తే సరిపోతుందనే యోచనలో ఉన్నట్టు గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరక్కుంటున్నాయి. కళ్లముందు లోపాలు కనిపిస్తున్నా దిద్దుబాటు చర్యలు లేవని అంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, కుత్బుల్లాపూర్‌, సనత్‌నగర్‌, ముషీరాబాద్‌, నాంపల్లి, మలక్‌పేట్‌లకు మాత్రమే ఇంఛార్జ్‌లు ఉన్నారు. మరి.. మిగతాచోట్ల కాంగ్రెస్‌ను పట్టించుకునేది ఎవరనేది పార్టీలో ఎవరికీ అంతుచిక్కడం లేదట.  

కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది రెండు డివిజన్లే!
పార్టీ అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు లేదా?

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 150 డివిజన్లు ఉండగా... కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండు చోట్లే గెలిచింది. ఇప్పుడు సిటీ కాంగ్రెస్‌లో పార్టీ తీరును చూస్తే ఆ రెండు సీట్లు అయినా నిలబెట్టుకుంటుందా అన్న అనుమానాలు ఉన్నాయట. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల కోసం ఇందిరాభవన్‌లో నిర్వహించిన సమావేశంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఎదుటే నేతలు ఘర్షణ పడేవరకూ వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు కూడా కొలిక్కి రాలేదు. వాటిని ఎప్పుడు వేస్తారో ఎవరికీ తెలియదు. దీంతో సిపాయిలు లేకుండానే GHMC ఎన్నికల యుద్ధానికి కాంగ్రెస్‌ సిద్ధమవుతుందా అన్న  ప్రశ్నలు వినిపిస్తున్నాయి.