తిరుపతిలో విమానానికి తప్పిన పెనుప్రమాదం

తిరుపతిలో విమానానికి తప్పిన పెనుప్రమాదం

 తిరుపతి విమానాశ్రయంలో స్పైస్‌ జెట్‌ విమానానికి ముప్పు తప్పింది. ముంబయి నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతి చేరుకున్న ఆ విమానం టైరు ల్యాండింగ్ సమయంలో పేలిపోయింది. విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా టైరు పేలినట్టు గుర్తించిన పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ఇక్కడి రేణిగుంట విమానాశ్రయంలో ఆగిన వెంటనే స్పైస్ జెట్ విమానానికి వెంటనే మరమ్మతులు నిర్వహించారు. అందులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే పైలట్‌  అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

నిన్న కూడా ఇదే విమానం ఆలస్యం కావడంతో ఇక్కడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమాన ఆలస్యంపై ప్రయాణికులకు యాజమాన్యం సరైన సమాచారం అందించకపోవడంతో వారు ఆందోళన చెందారు. ముంబయి నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతికి గురువారం సాయంత్రం 5.10 గంటలకు రావాల్సిన స్పైస్‌జెట్‌ విమానం సాంకేతిక లోపం కారణంగా ముంబయిలో ఆలస్యంగా బయలుదేరింది. దీంతో తిరుపతి నుంచి హైదరాబాదు మీదుగా ముంబయికి వెళ్లాల్సిన 170 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో రాత్రి పది గంటల వరకూ వేచిచూస్తూ ఉండిపోయారు. అందులో 20-30 మంది శుక్రవారం వెళ్లేందుకు వెనుదిరగగా మిగిలిన వారు వేచి ఉండక తప్పలేదు.