విశాఖ నుంచి రొయ్యల కోసం స్పెషల్ ఫ్లైట్

విశాఖ నుంచి రొయ్యల కోసం స్పెషల్ ఫ్లైట్

విశాఖ నుంచి రొయ్యల ఎగుమతి కోసం ప్రత్యేక విమానం నడిపేందుకు స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. స్పైస్‌ జెట్‌ నిర్ణయంతో దేశ విదేశాల్లో విశాఖ రొయ్యలకు డిమాండ్ మరింత పెరుగుతుంది. వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం.. అపారమైన మత్స్య సంపద.. వందల సంఖ్యలో హేచరీలు... ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం ప్రత్యేకత. విమానంలో రొయ్యల ఎగుమతులు చేస్తుండటంతో ఇకపై టేస్ట్ మరింత పెరగనుంది. స్వచ్చమైన, నాణ్యమైన మత్స్య సంపద నాన్ వెజ్ ప్రియుల చెంతకు చేరనుంది.  

విశాఖ ఫిషింగ్ హార్బర్ రొయ్యలు, చేపలు ఎగుమతులకు ప్రత్యేక గుర్తింపు పొందింది. గత ఏడాది సీజన్ ప్రారంభం నుంచి డిసెంబరు వరకు అంటే ఆర్నెళ్ల కాలంలో 66 వేల 5 వందల 42 టన్నుల చేపలు, 18 వేల 4 వందల 97 టన్నుల రొయ్యలు లభ్యమయ్యాయి. రొయ్యలతో పాటు ఈ తీరప్రాంతంలో ఖరీదైన ట్యూనా, వంజరం, కోనాం, చందువ లాంటి చేపలు అధికంగా లభిస్తున్నాయి. ఉప్పు చేపల తయారీకి చేపల రేవు ప్రధాన మార్కెట్‌గా పేరు పొందింది. ఇక్కడ లభిస్తున్న మత్స్య సంపదకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అమెరికా, జపాన్,యూరోపియన్‌ దేశాలకు ఇక్కడి నుంచే మత్స్య సంపద ఎగుమతి అవుతుంది. దేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాల్లోని స్టార్‌ హోటళ్ళు విశాఖ నుంచి నిత్యం రొయ్యలను కొనుగోలు చేస్తుంటాయి.
 
ఇప్పటి వరకూ ప్రాసెసింగ్ చేసిన రొయ్యలను ప్యాకింగ్ చేసి రైళ్ళ ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నా రు. విదేశాలకు ఎగుమతి చేసే రొయ్యలను ముందు చెన్నై, కోల్‌కతా తీసుకెళ్తారు. అక్కడి నుంచి విమానాల్లో పంపిస్తారు. ఫలితంగా నాణ్యమైన రొయ్యలు వినియోగదారుడికి చేరేందుకు అధిక సమయం పడుతోంది. విశాఖలో ఉన్న కార్గో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రొయ్యల ఎగుమతి కోసం ప్రత్యేక విమానం నడిపేందుకు స్పైస్ జెట్ సంస్ధ ముందుకొచ్చింది. రొయ్యలు, రొయ్య పిల్లల ఎగుమతి కోసం కోల్‌కతా, సూరత్ సెక్టార్లో కార్గో విమానాన్ని నడపనుంది. ఈ నెలాఖరు నుంచి కార్గో సేవలను  స్పైస్ జెట్  ప్రారంభించనుంది. 18 టన్నుల సామర్ధ్యంతో వారానికి ఆరు రోజులు పాటు చెన్నై-విశాఖ మీదుగా వస్తు రవాణా విమానాన్ని నడుపుతున్నట్టు స్పైస్ జెట్ ప్రకటించింది.
 
విశాఖ నుంచి ఎయిర్ కార్గో సేవలు విస్తరించే దిశగా ఇది కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య ఉత్పత్తుల ద్వారా సమకూరే ఆదాయం అధికంగా ఉంటోంది. ఐతే, సముద్ర ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల మత్స్యకారులకు ఆశించిన స్ధాయిలో ఆదాయం సమకూరడం లేదు. దిగుబడులకు తగ్గట్టుగా శీతల గిడ్డంగుల సౌకర్యం లేకపోవడంతో దళారులు నిర్ణయించిన ధరలకే మత్స్య ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. ధరలను నియంత్రించడంలో దళారుల రాజ్యం నడుస్తోంది. ఈ క్రమంలో విశాఖ నుంచి నేరుగా ప్రధాన నగరాలకు రొయ్యలను ఎగుమతులు చేసుకునేందుకు ఎయిర్ కార్గోసేవలు అందుబాటులోకి రావడం శుభ పరిణామం అంటున్నారు మత్స్యకారులు. ప్రపంచ దేశాల్లో విశాఖ మత్స్య సంపదకు ఉన్న డిమాండ్ దృష్ట్యా దళారులు వీటిని కొనుగోలు చేసి ఎగుమతులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మత్స్యకారులకే నేరుగా ఈ అవకాశం దక్కనుంది. దీంతో మత్స్యకారులు లాభపడనున్నారు.