రివ్యూ: స్పైడర్ మ్యాన్: ఇంటూ ది స్పైడర్ వెర్స్

రివ్యూ: స్పైడర్ మ్యాన్: ఇంటూ ది స్పైడర్ వెర్స్
న‌టీన‌టులు:  శమీయక్ మూర్, జేక్ జాన్సన్, హైలీ స్టెయిన్ ఫైల్డ్, మహీర్షల అలీ

సంగీతం : డేనియల్ పెంబెర్టోన్ 

దర్శకత్వం : పీటర్ రాంసేయ్, రోడ్నీ రొత్మన్, రాబర్ట్ పెర్సిచెట్టి 

నిర్మాత : మార్వెల్, సోనీ పిక్చర్స్ ఏనిమేషన్, కొలంబియా పిక్చర్స్ 

మార్వెల్ సృష్టించిన సూపర్ హీరో క్యారెక్టర్లలో స్పైడర్ మ్యాన్ చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్.  గాలిలో ఎగురుతూ, చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసే ఈ సూపర్ హీరో అంటే పిల్లలతో పాటు పెద్దలకూ ఇష్టమే.  మార్వెల్ స్టూడియోస్ ఈసారి సోనీ మోషన్ పిక్చర్స్ సంస్థతో కలిసి పిల్లల కోసం పూర్తిగా యానిమేషన్ ద్వారా రూపొందించిన 'స్పైడర్ మ్యాన్ : ఇంటూ ది స్పైడర్ వెర్స్' ఈ నెల 14న విడుదలై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని అలరిస్తోంది. 

కథ 

ఆఫ్రికన్-అమెరికన్ జాతీయుడికి, పుయర్టో రికో దేశస్తురాలికి పుట్టిన పిల్లాడు మైల్స్ మోరేల్స్ ఇక్కడ మన కొత్త స్పైడర్ మ్యాన్.  స్పైడర్ కుట్టడంతో అతను కూడ స్పైడర్ మ్యాన్ అవుతాడు.  అతను పీటర్ పార్కర్ లాంటి ఇంకొంతమంది స్పైడర్ క్యారెక్టరల్తో కలిసి చెడ్డవాడైన కింగ్ పిన్ దుష్ట చర్యల్ని అడ్డుకుంటాడు. 

విశ్లేషణ :

సినిమా మొదలవడమే ఆసక్తికరంగా మొదలవుతుంది.  మోరేల్స్   తనకిష్టమైన గ్రాఫిటీని వేస్తుండగా అతన్ని స్పైడర్ కుడుతుంది.  అలా అతను స్పైడర్ మ్యాన్ అవుతాడు.  కింగ్ పిన్ ల్యాబ్లో జరిగే ప్రయోగాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.  ఈ ప్రయత్నంలో అతను చేసే సాహసాలు చాలా ఆకట్టుకుంటాయి.  
 
ఇక సెకండాఫ్లో కింగ్ పిన్ తో నేరుగా పోరాటానికి దిగుతాడు చిట్టి స్పైడర్.  అతనికి తోడుగా పీటర్ పార్కర్ లాంటి వాళ్లంతా ఉంటారు.  వీరంతా కలిసి చేసే సాహస కృత్యాలు భలే గమ్మత్తుగా ఉండి పిల్లలకు చాలా వినోదాన్ని అందిస్తాయి.   తెర మీద నడిచేవి యానిమేషన్ పాత్రమే అయినా వాటి హావభావాలు మనుషులకన్నా చాలా బావుంటాయి.  పిల్లల సినిమా కాబట్టి కథను పెద్దగా కాంప్లికేటెడ్ గా కాకుండా చాలా సింపుల్ గా, సులభంగా అర్థమయ్యేలా ఉంచారు నిర్మాతలు.  
 
ఇక పాత్రల మాటలు, వాటి నడవడిక, యాక్షన్ స్టంట్స్ అన్నీ పిల్లలను దృష్టిలో పెట్టుకునే రూపిందించారు.  యానిమేషన్ వర్క అత్యున్నత స్థాయిలో ఉండి కొత్త అనుభూతిని అందిస్తుంది.  దర్సకుల బృందం చాలా పక్కాగా సినిమాను వినోదాత్మకమైన రీతిలో ఉండేలా తయారుచేసి సక్సెస్ అయింది.  
 
సాంకేతిక వర్గం పనితీరు : 
సాంకేతిక వర్గంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యానిమేషన్ టీమ్ గురించి.  సోనీ పిక్చర్స్ యానిమేషన్ వర్క్స్ తన 142 మంది యానిమేటర్స్ బృందంతో కలిసి చేసిన యానిమేషన్ వర్క్ కామిక్ బుక్ కళ్ళ ముందు నడుస్తున్నట్టు సినిమాను తయారుచేసింది.  ఒకరకంగా అది పిల్లల్ని ఒక యానిమేటెడ్ త్రీడీ లోకంలోకి తీసుకెళ్ళిపోయేలా ఉందనొచ్చు.  ఎక్కడా పొరపాట్లు కానీ, గందరగోళం కానీ చోటుచేసుకోలేదు.  
 
డేనియల్ పెంబెర్టోన్ సంగీతం సినిమాను సీరియస్ గా కాకుండా చాలా సరదాగా అదే సమయంలో ఉత్కంఠగా నడిచేందుకు సహాయపడేలా చేసింది.  రాబర్ట్ ఫిషర్ ఎడిటింగ్ బాగుంది.   నిర్మాతలు పెట్టిన 90 మిలియన్ డాలర్ల ఖర్చు స్క్రీన్ మీద కనబడింది.  పాత్రలకు తెర వెనుక  వాయిస్ ఓవర్ అందించిన నటీ నటుల పనితనం బాగుంది. 
 
పాజిటివ్ పాయింట్స్ : 
స్టోరీ లైన్ 
ఫస్టాఫ్, సెకండాఫ్లోని కెలక సన్నివేశాలు  
అబ్బురపరిచే యానిమేషన్ వర్క్ 
ఆకట్టుకునే స్పైడర్ మ్యాన్ సాహసాలు 
 
నెగెటివ్ పాయింట్స్: 
కొంత కథనం నెమ్మదిగా సాగడం  
 
చివరిగా : స్పైడర్ పిల్లలకు తెగ నచ్చేస్తాడు