భారత్‌-ఏ జట్టులో 'చహల్‌'

భారత్‌-ఏ జట్టులో 'చహల్‌'

టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజేవేంద్ర చాహల్‌ను  సెలక్టర్లు భారత్‌-ఏ జట్టుకు ఎంపిక చేశారు. ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగనున్న రెండు అనధికారిక టెస్టుల్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలెక్టర్లు సోమవారం ప్రకటించారు. పరిమిత ఓవర్లలో అద్భుతంగా రాణిస్తున్న చాహల్‌, కుల్‌దీప్‌లను టెస్టుల్లో ఆడించాలని భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తాజాగా విలేకరుల సమావేశంలో చెప్పాడు. దీన్ని పరిగణనలోకి తీసుకొనే సెలక్టర్లు చాహల్‌ను భారత్‌-ఏకు ఎంపిక చేసినట్టు సమాచారం. చాహల్ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడి దాదాపు రెండు సంవత్సరాలు అయింది. చాహల్‌ను టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయించేందుకు.. అందులో భాగంగానే టెస్ట్ ఫార్మాట్‌కు అలవాటు చేయాలనే ఉద్దేశంతో అతడిని భారత్‌-ఏకు ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. బెళగావిలో ఆగస్టు 4న మొదటి టెస్ట్, బెంగళూరులో ఆగస్టు 10 నుండి రెండో మ్యాచ్‌  జరుగుతుంది. భారత ‘ఎ’ జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యం వహించనున్నాడు. 

ఆగస్టు 17 నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’లతో జరిగే నాలుగు జట్ల వన్డే టోర్నీలో.. శ్రేయస్‌ అయ్యర్‌ భారత ‘ఎ’ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. భారత ‘బి’ జట్టుకు బ్యాట్స్‌మెన్‌ మనీశ్‌ పాండే సారథ్యం వహిస్తాడు. ఇక దులీప్‌ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ’కు ఫైజ్‌ ఫజల్‌, ‘రెడ్‌’కు అభిమన్యు మిథున్‌, ‘గ్రీన్‌’కు పార్థివ్‌ పటేల్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.