కోల్‌కతాపై సన్‌రైజర్స్‌ విజయం...

కోల్‌కతాపై సన్‌రైజర్స్‌ విజయం...
సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కు భంగపాటు కలిగింది. శనివారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కోల్‌కతాపై విజయం సాధించింది. 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఓపెనర్‌ సాహా మొదటి నుంచే దూకుడుగా ఆడుతుంటే.. మరోవైపు ధావన్‌ నెమ్మదిగా ఆడాడు. సాహా 24(15 బంతుల్లో 5 ఫోర్లు) క్యాచ్‌ ఔట్‌గా నరైన్‌ బౌలింగ్ లో పెవిలియన్ చేరగా.. ధావన్‌(7) కూడా నరైన్‌ కే చిక్కాడు. ఆ తర్వాత మనీష్‌ పాండే(4) కూడా తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకీబ్‌తో కెప్టెన్‌ విలియమ్సన్‌ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. షకీబ్‌ 27(21బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు)ను చావ్లా బౌల్డ్‌ చేసాడు. ఆ వెంటనే విలియమ్సన్‌(43 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సు) జాన్సన్‌ కు చిక్కాడు. చివరలో యూసఫ్‌ పఠాన్‌17(7 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సు), దీపక్‌ హుడా(5)తో కలిసి సన్‌రైజర్స్‌ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కోల్‌కతా బౌలర్ నరైన్‌ ఒక్కడే రాణించి రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ క్రిస్‌లిన్ ‌49( 34 బంతులు,7 ఫోర్లు,1 సిక్సు)‌, దినేశ్‌ కార్తీక్ 29(27 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్సు)‌, రానా 18(14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు)లు మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవడంతో తక్కువ స్కోర్ కే పరిమితం అయింది కోల్‌కతా. సన్‌రైజర్స్‌ బౌలర్ భువనేశ్వర్ మూడు వికెట్లు తీసాడు. 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' స్టాన్ లేక్ కు దక్కింది.