ముస్లింలకు వ్యతిరేకంగా హింస: శ్రీలంకలో కర్ఫ్యూ

ముస్లింలకు వ్యతిరేకంగా హింస: శ్రీలంకలో కర్ఫ్యూ

ఈస్టర్ నాడు ఆత్మాహుతి దాడులపై శ్రీలంకలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రాజధాని కొలంబోకి ఉత్తరాన ఉన్న కనీసం మూడు జిల్లాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా అల్లర్లు, హింసాకాండ చెలరేగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం సోమవారం నుంచి దేశవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. హింసాకాండ పెరగకుండా నిరోధించేందుకు కర్ఫ్యూ విధించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఎందుకు విధించారనే విషయంపై మాత్రం పోలీసులు నోరు విప్పడం లేదు. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ మంగళవారం ఉదయం 6 గంటలకు ఎత్తేస్తారు. మిగతా దేశంలో రాత్రి 9 గంటలకు కర్ఫ్యూ విధించి తెల్లవారు జామున 4 గంట వరకు అమలు చేస్తారు.

కొలంబో సమీపాన ఉన్న పుట్టాలం, కురునెగల, గంపహ జిల్లాల్లోని ప్రజలను ఇళ్లు దాటి బయటికి రావద్దని సూచించారు. ఆదివారం, సోమవారం క్రిస్టియన్ గుంపులు పలు ముస్లింల వ్యాపార సంస్థలు, దుకాణాలపై దాడిచేసి విధ్వంసం సృష్టించాయి. ముస్లింలకు చెందిన కార్లు, బైకులపై రాళ్లు విసిరి, నిప్పంటించిన సంఘటనలు జరిగాయి. హెట్టిపోలా పట్టణంలో మూడు దుకాణాలను దగ్ధం చేశారు. ఆరు పట్టణాల్లో పోలీసులు, భద్రతా బలగాలు సోమవారం బాష్పవాయువు ప్రయోగించి వందలాది అల్లర్లకు పాల్పడేవారిని చెదరగొట్టాయి. అల్లరిమూకలు మసీదులపై దాడి చేయబోయాయి. ఇప్పటి వరకు గాయపడినవారు, అరెస్టుల సమాచారం తెలియలేదు.