వెనక్కి తగ్గిన శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన

వెనక్కి తగ్గిన శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన

శ్రీలంకలో రాజకీయాలు దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్ పై విధించిన సస్పెన్షన్ ను తొలగిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. విక్రమసింఘే ను ప్రధాని పదవి నుంచి తప్పించి, రాజపక్సేను ఆ పదవిలో కూర్చోబెట్టి, సభ్యుల మద్దతు కూడగట్టేందుకు పార్లమెంట్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విక్రమసింఘే స్థానంలో రాజపక్సేను ప్రధానిగా నియమించడం... రాజ్యాంగ విరుద్ధమని రాణిల్ విక్రమసింఘే ఆరోపించారు. ఇప్పటికీ తానే ప్రధానినని వాదించారు. బలనిరూపణకు వీలుగా పార్లమెంట్‌ను వెంటనే సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు సస్పెండ్ చేస్తూ సిరిసేన నిర్ణయం తీసుకున్నారు. సభ్యులను కొనుగోలు చేయడం కోసం రాజపక్సేకు ఉపయోగపడేలా అధ్యక్షుడి నిర్ణయం ఉందని విక్రమసింఘే ఆరోపించారు. తాను విక్రమసింఘేనే ప్రధానిగా గుర్తిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో అధ్యక్షుడు వెనక్కితగ్గారు. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అధ్యక్షుడి తాజా నిర్ణయంతో పార్లమెంట్ సమావేశాలు వచ్చే వారం జరిగే అవకాశం ఉంది.