అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ!!

అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ!!

శ్రీలంకలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించనుంది. రాయిటర్స్ వార్తాసంస్థ రిపోర్ట్ ప్రకారం సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించనున్నారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అత్యవసర పరిస్థితి విధించనున్నారు. ఆదివారం ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలోని చర్చిల్లో జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత ప్రభుత్వం ఈ చర్య చేపడుతోంది. ఆదివారం శ్రీలంకలో జరిగిన 8 వరుస పేలుళ్లలో 290 మంది మరణించారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో 6 భారతీయ పౌరులు సహా 35 మంది విదేశీయులు చనిపోయారు.

ఈ నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్ శ్రీలంక సరిహద్దుల్లో గస్తీని పెంచింది. శ్రీలంక నుంచి తప్పించుకొన్న ఆత్మాహుతి ఉగ్రవాదులు రావచ్చనే అనుమానాలతో భారత తీర రక్షక దళం ఈ చర్య తీసుకొంది. సినామో గ్రాండ్ హోటల్ రెస్టారెండ్ లో ఒక ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాది తనను తాను పేల్చుకొన్నట్టు దాడులపై జరిపిన దర్యాప్తులో తేలింది. పేలుళ్లు జరపడానికి ఒక రాత్రి ముందే అతను హోటల్ లోని ఒక గదిలో బస చేసినట్టు తెలిసింది. పేలుడు జరిపిన ఉదయం అల్పాహారం స్వీకరించేందుకు అందరి కంటే ముందు లైన్ లో నిలబడినట్టు గుర్తించారు. ఆ తర్వాత బాంబు పేలుడు జరిపాడు. ప్రస్తుతం ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ వరుస పేలుళ్లకు బాధ్యతను ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు స్వీకరించలేదు. 

ఆదివారం చర్చిలు, హోటళ్లలో వరుసగా జరిగిన బాంబు పేలుళ్ల కేసులో శ్రీలంక పోలీసులు ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి సమాచారాన్ని బహిర్గత పరచలేదు. వీరిలో 13 మందిని కొలంబో, చుట్టుపక్కల రెండు ప్రదేశాల నుంచి అరెస్ట్ చేసినట్టు ఏఎఫ్ పి వార్తాసంస్థకు పోలీసులు చెప్పారు. దశాబ్దం క్రితం ఎల్టీటీఈ అంతంతో పాటు ముగిసిందనుకున్న రక్తపాత పోరాటం తర్వాత ఈ వరుస పేలుళ్లు మరోసారి శ్రీలంకలో శాంతిని భంగం చేశాయి.