వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా నాలుగో విజయం..

వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా నాలుగో విజయం..

వరుస విజయాలతో ఆస్ట్రేలియా దూసుకెళ్తోంది. వరల్డ్‌కప్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసి టాప్‌ ప్లేస్‌కి చేరింది. లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకను 87 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. ఆరొన్ ఫించ్ (153; 132 బంతుల్లో, 15 ఫోర్లు, 5 సిక్సులు) సెంచరీ నమోదు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (73; 59 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (46; 25 బంతుల్లో, 5 ఫోర్లు,1 సిక్స్) శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్, మరో బ్యాట్స్‌మన్ ఉస్మాన్ క్వాజా త్వరగా ఔట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఫించ్ కు చక్కటి సహకారం అందించాడు. శ్రీలంక బౌలింగ్ లో ఇసురు ఉదానా, ధనుంజయ డిసిల్వ చెరో రెండు వికెట్లు, లసిత్ మలింగా ఒక వికెట్ తీశాడు. 

335 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక.. ఆరంభంలో బాగానే ఆడినా మిడిల్‌ ఓవర్స్‌లో తడబడింది. ఓపెనర్లు కరుణరత్నె, కుశాల్‌ పెరీరాల 15.2 ఓవర్లలో 115/0తో నిలిచి శిబిరంలో ఆశలు రేపారు. పెరీరా అవుటయ్యాక కరుణరత్నెకు తోడుగా తిరిమానె (16) కాసేపు నిలవడంతో శ్రీలంక 153/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. తిరిమానె, వెంటనే కరుణరత్నె అవుటవడంతో వికెట్ల పతనం ప్రారంభమైంది. స్టార్క్‌, రిచర్డ్‌సన్‌ విజృంభించడంతో చివరి 7 వికెట్లు 35 పరుగులకే  కోల్పోయి 45.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది.