వైభవంగా భద్రాద్రి రాముడి పట్టాభిషేకం

వైభవంగా భద్రాద్రి రాముడి పట్టాభిషేకం

భద్రాచలంలో ఆదివారం రోజు శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణాన్ని వైభవంగా జరగగా.. ఇవాళ శ్రీసీతారామచంద్ర స్వామివారికి పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. మిథిలా స్టేడియంలో కన్నుల  పండువగా జరిగిన ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్ దంపతులు, పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో మిథిలా స్టేడియానికి తీసుకొచ్చిన అర్చకులు.. అనంతరం విశ్వక్సేన ఆరాధనతో పట్టాభిషేకం మహోత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత పవిత్ర నదీ జలాలతో స్వామివారికి అభిషేకం జరిపి అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన గావించారు. కల్యా ణంలో లాగే అభిజిత్‌ ముహూర్తంలో రజిత సింహాసనంపై సీతారామచంద్రస్వామివారిని పట్టాభిషిక్తుడ్ని చేశారు. ఇక శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించే సమయంలో రామదాసు చేయించిన ఆభరణాలను ధరింపజేయడం ఆనవాయితీగా వస్తుండగా.. స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్‌ కిరీటం.. ఇలా ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను తెలుపుతూ స్వామివారికి అలంకరించారు. శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవానికి తరలివచ్చిన గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు... స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అంతకు ముందు భద్రాద్రి రామయ్యను గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.