భద్రాద్రి రాముడి మహా పట్టాభిషేకం

భద్రాద్రి రాముడి మహా పట్టాభిషేకం

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఇక ఇవాళ శ్రీసీతారామచంద్ర స్వామివారికి పట్టాభిషేకం చేయనున్నారు. మిథిలా స్టేడియంలో కార్యక్రమాన్ని జరిపిస్తారు. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో మిథిలా స్టేడియంలో ఆశీనులను చేస్తారు. అనంతరం విశ్వక్సేన ఆరాధనతో పట్టాభిషేకం మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. తర్వాత పవిత్ర నదీ జలాలతో స్వామివారికి అభిషేకం జరిపి అష్టోత్తర, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన గావిస్తారు. కల్యా ణంలో లాగే అభిజిత్‌ ముహూర్తంలో సరిగ్గా మధ్యా హ్నం 12 గంటలకు రజిత సింహాసనంపై సీతారామచంద్రస్వామివారిని పట్టాభిషిక్తుడ్ని చేస్తారు. మరోవైపు శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించే సమయంలో రామదాసు చేయించిన ఆభరణాలను ధరింపజేయడం ఆనవాయితీ. స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్‌ కిరీటం.. ఇలా ఒక్కో ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ, వాటి విశిష్టతను తెలుపుతూ స్వామివారికి అలంకరిస్తారు. ఇక శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి భద్రాచలం చేరుకున్న గవర్నర్ దంపతులకు అధికారుల స్వాగతం పలికారు. కాసేపట్లో స్వామివారిని దర్శించుకోనున్న గవర్నర్ దంపతులు... అనంతరం మిథిలా స్టేడియానికి చేరుకుంటారు.