రివ్యూ : శ్రీనివాస కళ్యాణం

రివ్యూ : శ్రీనివాస కళ్యాణం

నటీనటులు : నితిన్, రాశిఖన్నా, నందితా శ్వేతా, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు 

మ్యూజిక్ : మిక్కీ జె మేయర్ 

ఫోటోగ్రఫి : సమీర్ రెడ్డి 

నిర్మాత : దిల్ రాజు

దర్శకత్వం : సతీష్ వేగేశ్న 

రిలీజ్ డేట్ : 09-08-2018

కుటుంబకథా చిత్రాలకు దిల్ రాజు బ్యానర్ పెట్టింది పేరు.  శతమానం భవతి అనే టైటిల్ తో ఇటీవలే వచ్చిన సినిమా మంచి హిట్ సాధించింది.  వేగేశ్న సతీష్ కుటుంబంలోని విలువలను ఆ సినిమాలో అందరికి అర్ధమయ్యేలా చూపించారు.  ఇప్పుడు పెళ్లంటే.. ఫంక్షన్ హాళ్లు, సౌండ్ మోతలు, అరువు తెచ్చుకున్న హడావుడి.. అసలు పెళ్లంటే ఇది కాదని, 20 సంవత్సరాల క్రితం పెళ్లిళ్లు ఎలా ఉంటాయో.. మరోసారి అందరికి అర్ధమయ్యేలా చూపించాలని శ్రీనివాస కళ్యాణం సినిమాను తీశారు.  నితిన్ రాశిఖన్నాలు జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

సంస్కృతీ, సంప్రదాయం, కట్టుబాట్లను అమితంగా ఆచరించే కుటుంబం నుంచి వచ్చిన నితిన్, డబ్బే లోకంగా జీవించే ప్రకాష్ రాజ్ కూతురు రాశిఖన్నాను ఇష్టపడతాడు.  రాశిఖన్నా కూడా నితిన్ ను ప్రేమిస్తుంది.  వీరి ప్రేమ విషయాన్నీ పెద్దలకు చెప్తారు.  ఇరు కుటుంబాలవారు వీరి ప్రేమను ఆమోదించి పెళ్లి చేయాలని అనుకుంటారు.  పెళ్లిని ఒక వేడుకలా చేసుకోవాలని ఆరాటపడతాడు నితిన్. ప్రకాష్ రాజ్ మాత్రం పెళ్లిని కూడా ఒక బిజినెస్ లా చూస్తాడు.  మరి పెళ్లి విషయంలో ప్రకాష్ రాజ్ మనసు మారిందా..? పెళ్లి చేయడానికి ప్రకాష్ రాజ్ ఏవైనా షరతులు పెట్టాడా..? షరతులు పెడితే ఆ షరతులు ఏమిటి? చివరికి పెళ్లి ఎలా జరిగింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

సినిమా టైటిల్ చూస్తేనే మనకు ఈ సినిమా దీనిగురించి తీశారో అర్ధం అవుతుంది.  సినిమా అంతా పెళ్లి అనే అంశం చుట్టూనే తిరుగుతుంది.  20 సంవత్సరాల క్రితం పెళ్లిళ్లు ఎలా జరిగాయో ఇప్పుడు పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో తెలియజేయడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం అని మొదటి నుంచి యూనిట్ చెప్తూనే ఉన్నది. దీనికి తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వేగేశ్న సతీష్.  పెళ్లి జీవితంలో ఒకేఒకసారి చేసుకునే వేడుక.  ఆ వేడుకను జ్ఞాపకం ఉండే విధంగా చేసుకోవాలి. అంతేకాని, ఎదో తూతూ మంత్రంగా చేసుకోకూడదు అని చెప్పే ప్రయత్నం చేశాడు.  శతమానం భవతిలో ఎలాగైతే పండుగ విశిష్టత గురించి చెప్పారో.. శ్రీనివాస కళ్యాణం సినిమాలో వివాహం యొక్క గొప్పదనం గురించి.. వివాహ ఘట్టంలో జరిగే తంతుల గురించి పూసగుచ్చినట్టుగా చూపించాడు దర్శకుడు.  నితిన్, ప్రకాష్ రాజ్ ల మనస్తత్వాలు విరుద్ధ ధృవాల వంటివి.  బంధాలు, అనుబంధాలకు నితిన్ విలువ ఇస్తే.. ప్రకాష్ రాజ్ డబ్బుకు విలువ ఇచ్చేవాడు.  ఈ రెండు పాత్రలలను బ్యాలెన్స్ చేసుకుంటూ.. కథను ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది.  ఈ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికి ముందే విడాకులపై అగ్రిమెంట్ చేయించుకోవడం.  సాధారణంగా ఏ వ్యక్తి కూడా ఇలా ఆలోచించడు.  కేవలం డబ్బుపై వ్యామోహం ఉన్న వ్యక్తే ఎలా ఆలోచిస్తాడు.  అది కూతురి వివాహం సమయంలోనే ఇలా విడాకుల గురించి ఆలోచించాడు అంటే అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  ఫస్ట్ హాఫ్ అంతా.. సరదాగా సాగిపోతుంది.  సెకండ్ హాఫ్ కు వచ్చే సరికి కథ మొత్తం పల్లెటూరికి మారిపోతుంది.  రెండు దశాబ్దాల క్రితం ఒక పల్లెటూరిలో వివాహం ఎలా జరిగేదో వాటన్నింటిని ఈ సినిమాలో చూపించాడు. సినిమా చూస్తున్నంతసేపు మనం వివాహ వేడుకకు హాజరయ్యామా అనే అనుమానం వస్తుంది.  అంతగా లీనం అవుతాం.  ఇలాంటి ఫామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎమోషన్స్ సన్నివేశాలు చాలా అవసరం. ఇందులో మనసుకు హత్తుకునే ఎమోషన్స్ చాలా తక్కువగా ఉండటం ఒక డ్రాబ్యాక్.  క్లైమాక్స్ సన్నివేశాలను ఇంకాస్త బలంగా, మనసుకు హత్తుకునేలా తీసి ఉంటె సినిమా ఇంకా బాగుండేది.  

నటీనటుల పనితీరు : 

మాస్ తరహా పత్రాలు ఎక్కువగా చేసిన నితిన్ ఇలాంటి అండర్ ప్లే పాత్రలో నటించడం చాలా కొత్తగా అనిపిస్తుంది.  నితిన్ సినిమాల్లో ఒక ఎనర్జీ, జోష్ కనిపిస్తుంది.  ఇవేమి ఈ సినిమాలో కనిపించవు.  రాముడు మంచి బాలుడు అనే విధంగా సాగుతుంది నితిన్ క్యారెక్టర్.  సినిమాకు చాలా ముఖ్యమైన పాత్రలో రాశిఖన్నా నటించింది.  అయితే, ఆ పాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు.  ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా మెరుపులు మెరిపించాడు.  తన పాత్రకు తగిన న్యాయం చేశాడు. కథనాల్లో ఇంకాస్త ఎమోషన్స్ ఉంటె ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అయ్యేది.  జయసుధ, రాజేంద్రప్రసాద్ తదితరులు ఎవరి పాత్ర మేరకు వారు మెప్పించారు.  

సాంకేతికం : 

ఇలాంటి సినిమాలకు మంచి మెలోడీ సంగీతం కావాలి.  మెలోడీ సంగీతాన్ని అందించే అతి తక్కువమంది సంగీత దర్శకుల్లో మిక్కీ జె మేయర్ ఒకరు.  ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలంగా మారింది.  పాటలు వినసొంపుగా ఉన్నాయి.  పాటలు వింటుంటే మనకు పాత కాలం నాటి పాటలు విన్నట్టుగా అనిపిస్తుంది.  పల్లెటూరి అందాలను మనోరంజకంగా చూపించాడు సమీర్ రెడ్డి.  దర్శకుడు ఏ పాయింట్ అయితే చెప్పాలని అనుకున్నాడో ఆ పాయింట్ బాగుంది.  అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మనకు సీరియల్ ను గుర్తుకు తెప్పిస్తాయి.  దీంతో కథనాల్లో వేగం తగ్గింది.  ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు.  

పాజిటివ్ పాయింట్స్ : 

పెళ్లి నేపధ్యం 

నటీనటులు 

సాంగ్స్ 

కథ 

నెగెటివ్ పాయింట్స్ : 

క్లైమాక్స్ 

సన్నివేశాల సాగతీత 

చివరిగా : శ్రీనివాసుని కళ్యాణం.. మనోరంజకం