ఎస్ఆర్ఎం వర్సిటీలో హడలిపోతున్న విద్యార్థినులు

ఎస్ఆర్ఎం వర్సిటీలో హడలిపోతున్న విద్యార్థినులు

తమిళనాడులోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థినులు హడలిపోతున్నారు. యూనివర్సిటీ క్యాంపస్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది వికృతచేష్టలతో చదువులు మానేసే పరిస్థితి దాపురించిందని బాధిత స్టూడెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. 

క్యాంపస్ లోని బాలికల హాస్టల్లో నిన్న జరిగిన ఘటనపై అమ్మాయిలంతా రాత్రిపూట మూకుమ్మడిగా ఆందోళన నిర్వహించారు. ఆ విషయం ఆలస్యంగా బయటపడింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ అమ్మాయి లిఫ్టులో వెళ్తుండగా.. శానిటరీ స్టాఫ్ సిబ్బంది ఒకరు చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో హడలిపోయిన ఆ అమ్మాయి అరవడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. లైంగికంగా వేధించిన ఆ వ్యక్తిపై కఠినచర్యలతో పాటు తమ హాస్టల్లో అంతా మహిళా సిబ్బందే ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే ఎస్ఆర్ఎంలో ఈ ఒక్క ఘటనే కాదని.. అమ్మాయిలుండే గదుల్లోకి పురుష స్టాఫ్ తొంగి చూడడం, రాత్రిపూట కూడా వరండాల్లో, గదుల ముందు తచ్చాడటం చేస్తున్నారని, వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియక తాము చదువుల మీద శ్రద్ధ చూపించలేకపోతున్నామని విద్యార్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటు పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు రంగంలోకి దిగారు.