సాహో ప్రీ రిలీజ్....అదే నచ్చిందన్న జక్కన్న !

సాహో ప్రీ రిలీజ్....అదే నచ్చిందన్న జక్కన్న !


ప్రభాస్ సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కూడా అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అయన బాహుబలి తర్వాత ప్రభాస్ కథను నమ్మి సాహో సినిమా చేయడం నచ్చిందని అన్నారు. సహజంగా ఓ పెద్ద సినిమా తీసిన తర్వాత పెద్ద దర్శకులతోనే తీయాలని భావిస్తారని, కానీ కథ మీద నమ్మకంతో సుజీత్ దర్శకత్వంలో నటించడం ప్రభాస్ కే చెల్లిందని అన్నారు.

బాహుబలి తర్వాత తన అభిమానులు ఇలాంటి కథనే ఇష్టపడతారని ప్రభాస్ భావించాడని, అందుకే ధైర్యంగా ముందడుగు వేశాడని రాజమౌళి అన్నారు. సాహో సినిమా కధ విన్నాక ఇంత పెద్ద కథను సుజీత్ డీల్ చేయగలడా అని అందరిలా దౌట్ పడినా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత అవన్నీ పటాపంచలు అయ్యాయని అన్నారు. సుజీత్ చాలా బాగా చేశాడని, అంత పెద్ద టెక్నీషియన్స్‌, బడ్జెట్‌, స్టార్స్‌ను పెట్టుకుని చేయడం మామూలు విషయం కాదని, ఆగస్టు 30న పెద్ద రికార్డులు సృష్టిస్తుందని అన్నారు. ప్రభాస్‌ ఇప్పటికే ఆలిండియా స్టార్‌ అని ఈ సినిమాతో మరో మెట్టు ఎదుగుతాడని రాజమౌళి చెప్పుకొచ్చారు.