ఆ సంస్థను ఏపీకి ఇవ్వడం తప్పు

ఆ సంస్థను ఏపీకి ఇవ్వడం తప్పు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. చిదంబరం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ విభజన చట్టంలోని దాదాపు పాతిక అంశాలపై చర్చించారు. తెలంగాణకు ఇచ్చిన హామీల అమలును సమీక్షించారు. సింగరేణి కాలరీస్ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్ఎమ్ఈఎల్) ఏపీ భూభాగంలో ఉన్నందున ఏపీకే చెందుతుందన్న షీలా భిడే సిఫార్సులను చిదంబరం అసమంజసంగా కొట్టిపారేశారు. ఏపీహెచ్ఎమ్ఈఎల్ లో సింగరేణి కాలరీస్ వాటా 81 శాతం ఉండగా, ఉమ్మడి ఏపీకి కేవలం 0.86 మాత్రమే వాటా ఉంది. మిగిలింది ప్రజల వాటా. దీన్ని ఉటంకిస్తూ చిదంబరం ఆ వ్యాఖ్యలు చేశారు. ఇక హైకోర్టు విభజన, రెవెన్యూ పంపకాలు, ఏపీ భవన్ విభజన అంశాలపై తెలంగాణ ప్రభుత్వాధికారులు సవివరంగా సమాచారాన్ని అందించారు. ఏపీకి సంబంధించిన అంశాలపై గత నెల 27నే ఆంధ్రా అధికారులు స్టాండింగ్ కమిటీకి రిపోర్టు సమర్పించారు. అసెంబ్లీ స్థానాల పెంపు పైనా స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగింది. సమావేశంలో చిదంబరంతో పాటు కమిటీ సభ్యులు బి.బి. పాటిల్, కేంద్ర హోంశాఖ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SK జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, స్టేట్ రీ ఆర్గనైజేషన్  ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, CMD ప్రభాకర్ రావు,  తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్, ట్రాన్స్ కో జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ సుశీల్ కుమార్, సింగరేణి కాలరీస్ డైరెక్టర్ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.