ఒకే పాయింట్.. కోహ్లీని వెనక్కి నెట్టేసింది..!

ఒకే పాయింట్.. కోహ్లీని వెనక్కి నెట్టేసింది..!

ఒకే ఒక్క పాయింట్.. కానీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టాప్ స్పాట్‌ నుంచి వెనక్కి నెట్టేసింది... ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. గత ఏడాది బాల్ ట్యాంపరింగ్‌ వ్యవహారంతో నిషేధం ఎదుర్కొన్న స్మిత్.. రీ ఎంట్రీ తర్వాత మళ్లీ సత్తా చాటుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 904 పాయింట్లతో స్మిత్ టాప్‌స్పాట్‌లో ఉండగా.. కేవలం ఒకే ఒక్క పాయింట్ తేడాతో అంటే 903 పాయింట్లతో విరాట్ కోహ్లీ రెండో ర్యాంకుకు పడిపోయాడు. ఇక, 878 పాయింట్లతో కేన్ విలియమ్‌సన్ థర్డ్ ర్యాంక్, 825 పుజారా ఫోర్త్ ర్యాంక్, 749 పాయింట్లతో హెర్నీ నికోలస్ ఐదో ర్యాంకులో ఉన్నారు. భారత్-వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ముగియగానే ఈ ర్యాంకులను ప్రకటించింది ఐసీసీ.

ఇక ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ ర్యాంకింగ్స్ పరిశీలిస్తే.. 908 పాయింట్లతో ప్యాట్‌ కమ్మిన్స్ ఫస్ట్ ర్యాంకులో ఉండగా.. 851 పాయింట్లతో కగిసో రబాడా సెకండ్ ర్యాంక్, 835 పాయింట్లతో జస్ర్పీత్ బుమ్రా థర్డ్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో పాయింట్ల పట్టికలో ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకాడు బుమ్రా. వెండీస్ పర్యటనతో మంచి ప్రదర్శనతో బూమ్రా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక, వెస్టిండీస్ పర్యటనలో 2-0తో టెస్ట్ సిరీస్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో.. టీ-20, వన్డే, టెస్ట్ సిరీస్‌ ఇలా అన్నింటినీ క్లీన్‌స్వీప్ చేసింది కోహ్లీ సేన.