నష్టాలతో ముగిసిన మార్కెట్లు

నష్టాలతో ముగిసిన మార్కెట్లు

అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ భయాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపడంతో సూచీలకు ఆటుపోట్లు తప్పలేదు.. దీంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే సూచీలు ఒక సెషన్‌లో లాభాలను.. మరో సెషన్‌లో నష్టాలను చవిచూస్తూ వచ్చాయి. ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 70 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. అయితే బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్నాలజీ రంగాలు షేర్లు పడిపోవటంతో సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోయింది.. చివరి సెషన్‌లో కాస్తంత కోలుకునేలా కనిపించినప్పటికీ.. నష్టాలు తప్పలేదు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్ల నష్టంతో 35,227 వద్ద.. నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 10,696 వద్ద స్థిరపడ్డాయి. ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, మారుతి సుజుకీ, ఎయిర్‌టెల్, హీరో మోటార్స్, హిందాల్కో కంపెనీల షేర్లు రాణించగా.. బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, గెయిల్ షేర్లు నష్టపోయాయి.