నిఫ్టిని కాపాడిన షేర్లు ఇవే...

నిఫ్టిని కాపాడిన షేర్లు ఇవే...

అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్ల నుంచి ఇప్పటి వరకు అన్ని మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లలోనే మన మార్కెట్లు పయనించాయి. కాని తీవ్ర ఆటుపోట్లకు గురైంది మార్కెట్. ఒకదశలో 10,733 కనిష్ఠస్థాయిని చూసిన నిఫ్టి తరవాత కోలుకుని 10,818 గరిష్ఠ స్థాయిని తాకింది. మిడ్‌ సెషన్‌లో కాస్త ఒత్తిడి వచ్చినా నిలదొక్కుకుని 10,802 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 30 పాయింట్లు లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల సూచీ రికార్డు స్థాయిలో 3 శాతం పెరిగింది. అలాగే ఫార్మా సూచి ఒకటిన్నర శాతం లాభపడింది. ఐటీ స్థిరంగా ఉంది. నిఫ్టి షేర్లలో 24 షేర్లు లాభాలతో క్లోజ్‌ కాగా, 26 షేర్లు నష్టాలతో ముగిశాయి. లాభాలతో ముగిసిన షేర్లలో సన్‌ ఫార్మా నాలుగు శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ 3 శాతం చొప్పున లాభపడ్డాయి. టాటా మోటార్స్‌, ఎస్‌ బ్యాంక్‌ షేర్లు రెండున్నర శాతం లాభంతో క్లోజయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ షేర్‌ నిఫ్టి షేర్లలో టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఈ కంపెనీ షేర్‌ 3 శాతం క్షీణించి 449 వద్ద ముగిసింది. యూపీఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి.