బడ్జెట్‌ ముందు.. స్థిరంగా ముగిసిన నిఫ్టి

బడ్జెట్‌ ముందు.. స్థిరంగా ముగిసిన నిఫ్టి

ఇవాళ వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు కావడంతో మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. మార్కెట్‌ ట్రెండ్‌ పాజిటివ్‌గా ఉన్నా... సూచీలు హెచ్చతగ్గులకు లోనయ్యాయి. రేపు బడ్జెట్‌ ఉండటం కూడా మరో కారణం. బడ్జెట్‌పై మార్కెట్‌ భారీ అంచనాలతో ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఉద్దీపన ప్యాకేజీ వస్తుందన్న ఆశతో పీఎస్‌యూ బ్యాంకులకు భారీ మద్దతు అందింది. దీంతో పీఎస్‌యూ బ్యాంకుల సూచీ దాదాపు ఒకటిన్నర శాతం పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్లు పెరిగి 11946 వద్ద ముగిసింది. రేపు భారీ బంపర్‌ ఆఫర్లు ఉంటే మినహా... రేపటి గరిష్ఠ స్థాయి నుంచి మార్కెట్‌ పతనం మొదలు కానుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లన్నీ పడటానికి సిద్ధంగా ఉన్నాయి. వృద్ధి అవకాశాలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. బడ్జెట్‌లో భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు పొందిన రంగాలు మినహా మిగిలిన రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఉంటుందని టెక్నికల్‌ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం మార్కెట్‌ ఇప్పటికే ఆల్‌ టైమ్‌ హైలో ఉండటం. డాలర్‌తో రూపాయి బాగా బలపడటం ఐటీ కంపెనీలకు తీవ్ర ప్రతిబంధకంగా మారింది. ఇవాళ నిఫ్టి ప్రధాన షేర్లలో యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిటానియా, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌  టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. టాప్‌ లూజర్స్‌గా ఉన్న షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, టైటాన్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రధాన షేర్లలో ఐఐఎఫ్‌ఎల్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, జైన్‌ ఇరిగేషన్‌, హెడల్‌బర్గ్‌ సిమెంట్‌ టాప్ గెయినర్స్‌గా ఉండగా, క్యూఈఎస్‌ఎస్‌, థామస్‌ కుక్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, పీఈఎల్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా ముగిశాయి.