నిఫ్టి: కుప్పకూలిన షేర్‌ మార్కెట్‌

నిఫ్టి: కుప్పకూలిన షేర్‌ మార్కెట్‌

బడ్జెట్‌ ముందు మార్కెట్‌ భారీగా క్షీణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా... మన మార్కెట్‌లో బ్లూచిప్‌ షేర్లను కూడా భారీగా అమ్ముతున్నారు. శుక్రవారం అమెరికా నామమాత్రపు నష్టాలు పొందినా.. ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇక మిడ్ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు కనిష్ఠ స్థాయిల్లోనూ కొనసాగుతున్నా... మన మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ఆరంభం నుంచి చివరి దాకా కొనసాగింది. ఎక్కడా కోలుకోలేదు. ప్రధాన, బ్లూచిప్‌ షేర్లను కూడా భారీ అమ్మడం చూస్తుంటే.. మున్ముందు మార్కెట్‌ మరింత పతనం అవుతుందా? అన్న అనుమానం కల్గుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 20 పాయింట్ల లాభంతో 11,844 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇదే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి. ప్రారంభమైన నిఫ్టి కొన్ని క్షణాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్‌ చివరి వరకు పతనం కొనసాగి 11,657 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అక్కడి నుంచి 15 పాయింట్లు పెరిగి 11,672 వద్ద ముగిసింది. నిఫ్టి 151 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్ 491 పాయింట్లు క్షీణించింది. నిఫ్టి షేర్లలో కేవలం 4 షేర్లు లాభాల్లో క్లోజ్‌ కాగా, 46 షేర్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కోల్‌ ఇండియా, విప్రో షేర్లు లాభాల్లో క్లోజ్‌ అయ్యాయి. టాప్‌ గెయినర్స్‌ అన్నీ నామ మాత్రపు లాభాలకే పరిమితం అయ్యాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాప్‌లో ఉన్న షేర్లు... టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఓఎన్‌జీసీ షేర్లు ఉన్నాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రధాన షేర్లలో అపోలో టైర్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌, యూకో బ్యాంక్‌, హెక్సావేర్‌, సెంట్రమ్‌ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన షేర్లలో టాప్‌ షేర్లు... జెట్‌ ఎయిర్‌వేస్‌, పీసీ జ్యువల్లర్స్‌ వక్రంగి, కోక్స్ అండ్‌ కింగ్స్‌, జేపీ అసోసియేట్స్‌.