చుక్కలు చూపించిన నిఫ్టి

చుక్కలు చూపించిన నిఫ్టి

నిఫ్టి ఇవాళ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. ఆరంభం నుంచి మిడ్‌ సెషన్‌కు పతనమైన నిఫ్టి ఆ తరవాత అనూహ్యంగా కోలుకుంది. చివర్లో లాభాలన్నీ పొగొట్టుకుని స్థిరంగా క్రితం ముగింపు వద్దే  ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్న నేపథ్యంలో ఆరంభంలోనే 53 పాయింట్ల లాభంతో బోణి చేసింది నిఫ్టి. క్రమంగా మద్దతు అందడంతో ఏకంగా 11,802 పాయింట్లకు చేరింది. దీనికి కారణంగా నిన్న యూరో మార్కెట్లు రెండు శాతం దాకా పెరగడం, రాత్రి అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా లాభపడటం. పైగా ఆసియా మార్కెట్లు ముఖ్యంగా హాంగ్‌సెంగ్‌ రెండు శాతంపైగా లాభంతో ఉన్న సమయంలో నిఫ్టి ప్రారంభమైంది. (సాధారణంగా హాంగ్‌సెంగ్‌ను నిఫ్టి ఫాలో అవుతుంది) ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ రికార్డు లాభాలు సాధిస్తుందని భావించిన ఇన్వెస్టర్లకు నిఫ్టి షాక్‌ ఇచ్చింది. క్రమంగా లాభాలన్నీ పొగొట్టుకుని.. భారీ నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 11625కు పడిపోయింది. క్లోజింగ్‌లో కోలుకుని ఒక మోస్తరు లాభాలు గడించింది. కాని క్లోజింగ్‌లో ఆ లాభాలు కూడా పోయి... 11,691 వద్ద ముగిసింది. అంటే సరిగ్గా క్రితం ముగింపు వద్దే అన్నమాట. రాత్రికి అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి స్థిరంగా ఉంది. నిఫ్టి ప్రధాన షేర్లలో టాటా స్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొటక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టైటాన్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా ముగిశాయి. ఇక టాప్‌ లూజర్స్‌గా ముగిసిన షేర్లు... ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌.
ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించే షేర్లలో టాప్‌ గెయినర్స్‌... ట్రెంట్‌, టాటా స్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సింఫని, బయోకాన్‌.
సెన్సెక్స్‌ ప్రధాన టాప్‌ లూజర్స్‌... జైన్‌ ఇరిగేషన్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, హెచ్‌డీఐఎల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, వక్రంఘి.