11800 పైన ముగిసిన నిఫ్టి

11800 పైన ముగిసిన నిఫ్టి

ఈ నెల డెరివేటివ్స్‌ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. నిన్నటి బుల్‌ రన్‌ ఇవాళ కూడా కొనసాగింది. ట్రేడింగ్‌ సరళి అచ్చంగా నిన్నటి మాదిరే సాగింది. ఉదయం స్వల్ప లాభంతో 11768 వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత స్వల్పంగా క్షీణించి 11757కి తగ్గినా.. వెంటనే అక్కడి నుంచి పెరగడం ప్రారంభమైంది. మిడ్‌ సెషన్‌ తరవాత 11871 గరిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టి.. చివరల్లో లాభాల స్వీకరణ కారణంగా  11847 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 51 పాయింట్లు పెరగ్గా, సెన్సెక్స్‌ 157 పాయింట్లు లాభపడింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి ఇవాళ మరింత బలపడింది. ముడి చమురు ధరలు పెరిగినా మన మార్కెట్‌ పట్టించుకోలేదు. నిఫ్టి ప్రధాన షేర్లలో వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, సన్‌ ఫార్మా, హిందాల్కో షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌ జాబితాల్లో టాప్‌ ఫైవ్‌ షేర్లు ఇవి... బ్రిటానియా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌.
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లు.. రిలయన్స్‌ క్యాపిటల్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, సుజ్లాన్‌, ఐఎఫ్‌సీఐ, ఆర్ పవర్‌ ఉన్నాయి. ఇక సెన్సెక్స్‌ ప్రధాన టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు ఇవి... కాక్స్ అండ్‌ కింగ్స్‌, బీబీటీసీ, లక్స్‌ ఇండస్ట్రీస్‌, వక్రంగి, దీపక్‌ ఫర్టిలైజర్స్‌.