భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్‌లోని ప్రతికూల అంశాలను ఏవీ మార్కెట్‌ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాల జోష్‌ను కొనసాగిస్తూ.. ఇపుడు ఆర్బీఐ క్రెడిట్‌ పాలిసీని డిస్కౌంట్‌ చేస్తోంది మార్కెట్‌. వారం రోజుల నుంచి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లతో పాటు ముడి చమురు ధరలు గణీయంగా క్షీణించినా.. మన మార్కెట్లు మాత్రం రోజూ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. గత వారం జీడీపీ వృద్ధిరేటు దారుణంగా ఉంది, 45 ఏళ్ళ కనిష్ఠ స్థాయికి నిరుద్యోగిత, కుప్ప కూలిన ఆటో మొబైల్‌ అమ్మకాలు.. వీటిని మార్కెట్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈసారి ఆర్బీఐ క్రెడిట్‌ పాలసీలో పావు శాతం లేదా అరశాతం వరకు వడ్డీ రేట్లను పెంచుతాయనే ఆశతో కొనుగోళ్ళ మద్దతు అందుతోంది. పైగా పడిపోతున్న చమురు ధరలు అనేక కంపెనీలకు వరంలా మారింది. ఇవాళ ఉదయం 11953 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి కాసేపటికే 11920 పాయింట్లుకు క్షీణించి ఆ తరవాత జెట్‌ స్పీడుతో దూసుకెళ్ళింది. ముఖ్యంగా మిడ్‌ సెషన్‌ తరవాత మార్కెట్‌ జోరుకు అంతేలేకుండా పోయింది. ఒకదశలో 12103 పాయింట్లకు చేరిన నిఫ్టి చివర్లో 165 పాయింట్ల లాభంతో 12088 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 553 పాయింట్లు పెరిగింది. నిఫ్టి ప్రధాన షేర్లలో హీరో మోటోకార్ప్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. టాప్‌ లూజర్స్‌ జాబితాలో గెయిల్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటక్‌ సిమెంట్స్‌ ఉన్నాయి. అయితే ఈ నష్టాలన్నీ నామా మాత్రమే. ఇక బీఎస్‌ఈ టాప్ గెయినర్స్‌లో ఇన్ఫోఎడ్జ్‌ (నౌకరీ), అపోలో హాస్పటిల్స్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, హీరో మోటోకార్ప్‌, ట్రెంట్‌ షేర్లు ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు... హెరిటేజ్‌ ఫుడ్స్‌, మన్‌పసంద్‌ ఇండస్ట్రీస్‌, వాక్రంగీ, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, డీసీఎం శ్రీరామ్‌ షేర్లు ఉన్నాయి.