స్టాక్ మార్కెట్ః వ‌చ్చే వారం ఎలా ఉంటుందంటే...

స్టాక్ మార్కెట్ః వ‌చ్చే వారం ఎలా ఉంటుందంటే...

ఈవారం దేశీయ ప‌రిణామాల‌తో పాటు అంత‌ర్జాతీయ అంశాలు మార్కెట్‌ను ప్ర‌భావితం చేయ‌నున్నాయి. ప్ర‌ధానంగా వినియోగ ధ‌ర‌ల సూచీతో పాటు టోకు ధ‌ర‌ల సూచీ ఆధార ద్ర‌వ్యోల్బ‌ణ గ‌ణాంకాలు ఈ వారం విడుద‌ల కానున్నాయి. అలాగే పారిశ్రామిక ఉత్ప‌త్తి గ‌ణాంకాలు కూడా వెల్ల‌డికానున్నాయి. వ‌చ్చే నెల ఆర్బీఐ వెల్ల‌డించ‌నున్న ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధానంపై వీటి ప్ర‌భావం ఉండబోతోంది. అలాగే ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ కూడా కీల‌కం. ఎందుకంటే గ‌త కొన్ని రో్జులుగా రూపాయి బ‌ల‌హీనంగా ఉన్నందున ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గినా దేశీయంగా ధ‌ర‌లు త‌గ్గించే ప‌రిస్థితి లేదు. పైగా గ‌త శుక్ర‌వారం వెలువ‌డిన ఉద్య‌గ అవ‌కాశాల డేటా చాలా సానుకూలంగా ఉండ‌టం మార్కెట్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. శుక్ర‌వారం డాల‌ర్ ఇండెక్స్ దాదాపు అర‌శాతం పెరిగింది. అంటే సోమ‌వారం రూపాయి మ‌ళ్ళీ 72 స్థాయిని దాట‌నుంద‌న్న‌మాట‌. గ‌త వారం 71.73 వ‌ద్దముగిసింది. ముడి  చ‌మురు ధ‌ర‌లు త‌గ్గిన‌ట్లే త‌గ్గి..శుక్ర‌వారం గ్రీన్‌లో ముగిశాయి. దీంతో ముడి చ‌మురు ధ‌ర‌లు, డాల‌ర్ పెర‌గ‌డం వ‌ల్ల మ‌న దేశంపై  తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డ‌నుంది.  ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి విలువ 13 శాతం క్షీణించింది. ఇక బాండ్ల‌పై ఈల్డ్ ఎనిమిది శాతం దాటింది.దీంతో వ‌చ్చే నెల ఆర్బీఐ వ‌డ్డీ రేట్ల‌ను పెంచ‌డం ఖాయ‌మ‌ని ఫైనాన్షియ‌ల్ రంగ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా వ‌చ్చేవారం మార్కెట్ల స్థిరంగా లేదే ఒక మోస్త‌రు లాభాల‌ను గ‌డించే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. విదేశీ ఇన్వెస్ట‌ర్ల‌కు అనుకూలంగా ఆర్థిక శాఖ కొత్త  రూల్స్ తేనుందన్న వార్త‌లు మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 
ఎప్ప‌టి లాగే గ‌త వారం కూడా విదేశీ ఇన్వెస్ట‌ర్లు అమ్ముతుంటే మ‌న దేశీయ ఇన్వెస్ట‌ర్లు కొంటున్నారు. గ‌త‌వారం విదేశీ ఇన్వెస్ట‌ర్లు రూ. 789 కోట్ల విలువైన షేర్ల‌ను అమ్మ‌గా, మ‌న దేశీయ ఆర్థిక సంస్థ‌లు రూ. 1,167 కోట్ల విలువైన షేర్ల‌ను కొనుగోలు చేశారు. దీనిబ‌ట్టి చూస్తే మ‌ధ్య‌కాలంలో నిఫ్టి బుల్లిష్ గా ఉండే అవ‌కాశాలే అధికంగా ఉన్నాయి.  11760ని దాటితే నిఫ్టి కొత్త రికార్డులు సృష్టించ‌వ‌చ్చు. ప‌డిన ప‌క్షంలో నిఫ్టి  11393 లేదా 11340 వ‌ద్ద మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశాలు అదికంగా ఉన్నాయి. వినాయ‌క చ‌తుర్థి సంద‌ర్భంగా గురువారం మార్కెట్ల‌కు సెల‌వు.