భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

మార్చి డెరివేటివ్స్‌ దగ్గర పడుతుండటంతో మార్కెట్‌లో ఒత్తిడి పెరుగుతోంది. నెల ఆరంభం నుంచి ఏకబిగిన పెరుగుతూ వస్తున్న మార్కెట్‌కు అధిక స్థాయిలో ఒత్తిడి వస్తోంది. ఇవాళ ఆరంభం నుంచి మార్కెట్‌ తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైంది. తొలి సెషన్‌లో భారీగా తగ్గిన ఇండెక్స్‌.. రెండో సెషన్‌లో పెరిగేందుకు ప్రయత్నించినా చివరి గంటలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. నిఫ్టి 64 పాయింట్ల నష్టంతో 11,456 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 222 పాయింట్లు తగ్గింది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా పెరిగినా.. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో జోన్‌లో కూడా భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి.

నిఫ్టి ప్రధాన షేర్లలో ఎన్‌టీపీసీ నాలుగు శాతం పెరగ్గా.. ఎల్‌ అండ్‌ టీ రెండు శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ ఒక శాతం పెరిగాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫోసిస్‌ నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. ఇక నిఫ్టిలో టాప్ లూజర్స్‌గా నిలిచిన షేర్లలో బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ ఉన్నాయి. బీఎస్‌ఇలో ఆర్‌ కామ్‌ పది శాతం, స్పైస్‌ జెట్‌ ఏడు శాతం, ప్రిస్టేజి 6 శాతం, సెంట్రల్‌ యూనియన్‌ బ్యాంక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ నాలుగు శాతంపైగా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్లలో మదర్సన్‌ సుమి 7 శాతం, వాబాగ్‌ టెక్‌ ఆరు శాతం, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, డీబీ లిమిటెడ్‌ 6 శాతం చొప్పన తగ్గాయి.