భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

ఉదయం భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను కంగారు పెట్టిన స్టాక్‌ మార్కెట్‌ మిడ్‌ సెసన్‌కల్లా నష్టాల నుంచి తేరుకుంది. అమెరికా మార్కెట్ల పతనం, భారీ క్రూడ్‌ ధరల పతనంతో కంగారు పడిన ఇన్వెస్టర్లు ఇవాళ ఉదయం భారీ అమ్మకాలకు పాల్పడ్డారు. ప్రపంచ ఆర్థికవృద్ధిరేటుపై అనుమానాలు అధికం కావడంతో గతకొన్ని సెషన్స్‌లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. మొన్న రాత్రి అమెరికా నష్టాలకు స్పందించి ఆరంభంలో తగ్గని నిఫ్టి.. మిడ్ సెషన్‌కల్లా తీరుకుని భారీ లాభాల్లోకి వచ్చింది. జపాన్‌ నిక్కీ ఆకర్షణీయ లాభాలు గడించడంతో పాటు క్రూడ్‌ ధరల పతనం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మెరుగుపర్చింది. ఉదయం ఒకదశలో 10,534కు పడిపోయిన నిఫ్టి దాదాపు 200 పాయింట్లు పెరిగి 10,729 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 66 పాయింట్లు పెరిగింది. బ్యాంక్‌ నిఫ్టి ఒక శాతం పెరగ్గా, మీడియా సూచీ రెండు శాతం, ఫైనాన్షియల్‌ రంగ సూచీ ఒక శాతంపైగా లాభపడ్డాయి. 

నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ 4 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ షేర్లు కూడా 4 శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌ కూడా 2 శాతం పెరిగింది. ఇక నష్టాల్లో ముగిసిన షేర్లలలో సన్‌ ఫార్మా టాప్‌లో ఉంది. ఎస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ ఒకశాతంపైగా నష్టంతో క్లోజ్‌ కాగా, ఇన్ఫోసిస్‌, ఐషర్‌ మోటార్స్‌ కూడా నష్టాల్లో ముగిశాయి.