స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

వరుసగా అయిదు రోజులు నష్టాల్లో ముగిసిన నిఫ్టి ఇవాళ కూడా నష్టాల్లో ప్రారంభమైంది. నష్టాలు చాలా నామమాత్రంగా ఉండటం ఉపశమనం కల్గించే అంశం. అంతర్జాతీయ మార్కెట్లు నిరాశాజనకంగా ఉన్నాయి. యూరో మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు నిస్తేజంగా క్లోజయ్యాయి. నాస్‌ డాక్‌ గ్రీన్‌లో ముగిసినా.. డౌ జోన్స్‌ 0.68 శాతం నష్టంతో ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌కు సెలవు. జపాన్‌ మార్కెట్లు స్వల్ప లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.

నిన్న రాత్రి నుంచి చైనా వస్తువులపై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సుమారు 20,000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై ట్రంప్‌ ప్రభుత్వం 10 శాతం దిగుమతి సుంకం అదనంగా వేసింది. మరోవైపు క్రూడ్‌ ధరలు నాలుగేళ్ళ గరిష్ఠ స్థాయిని దాటాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు 80.7 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో అనేక వర్థమాన మార్కెట్లు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి 10,969 పాయింట్ల వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. పైకి నిఫ్టి కాస్త గ్రీన్‌లోకి వచ్చినట్లు కన్పిస్తున్నా.. నిఫ్టిలోని 50 షేర్లలో 17 షేర్లు మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. 33 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. లాభాలతో ట్రేడవుతున్న నిఫ్టి షేర్లలో ఓఎన్‌జీసీ, ఎస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బీపీసీఎల్‌ ఉన్నాయి. హౌసింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. హెచ్‌డీఎఫ్‌ఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బోర్డు మీటింగ్‌ ఉన్నందున ఎస్‌ బ్యాంక్‌ లాభాల్లో ట్రేడవుతోంది.