న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్‌

న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్‌

అమెరికా మార్కెట్‌లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇంత  నిరుత్సాహం క‌ల్గించిన క్రిస్మస్ ఈ మ‌ధ్య‌కాలంలో లేదు. వ‌రుస‌గా భారీగా క్షీణిస్తున్న మార్కెట్లు ఇన్వెస్టర్లను కంగారు పెట్టిస్తున్నాయి. బేర్ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు మార్కెట్ సిద్ధంగా ఉన్న‌ట్లు టెక్నిక‌ల్ అన‌లిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. డాల‌ర్‌, స్టాక్ మార్కెట్ల‌తో పాటు క్రూడ్ ధ‌ర‌లు కూడా భారీగా క్షీణించ‌డంతో ప్ర‌పంచ మార్కెట్ల‌కు కీడు శంకిస్తోంది. జ‌పాన్ మార్కెట్ కూడా అయిదునెల‌ల క‌నిష్ఠానికి చేరి బేర్ మార్కెట్‌లోకి చేరుకోవ‌డానికి సిద్ధ‌మైంది. సోమ‌వారం క్రూడ్ ఏకంగా ఆరు శాతం క్షీణించ‌డంతో మార్కెట్ల‌కు చెడు సంకేతాల‌ను పంపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వృద్ధి రేటుపై వ‌స్తున్న అనుమానాల‌కు... అమెరికా రాజ‌కీయ గొడ‌వ‌లు తోడు కావ‌డంతో ఇన్వెస్ట‌ర్ల‌లో టెన్ష‌న్ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా  ప్రారంభ‌మ‌య్యాయి. జ‌పాన్ నిక్కీ స్వ‌ల్ప లాభాల్లో ఉండ‌గా, ఇత‌ర మార్కెట్లు రెడ్‌లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్ మార్కెట్ల‌కు సెల‌వు. నిఫ్టి ఆరంభంలోనే న‌ష్టాల్లోకి జారుకుంది. ఒక‌ద‌శ‌లో 80 పాయింట్లు క్షీణించిన నిఫ్టి ఇపుడు 70 పాయింట్ల నష్టంతో ట్రేడ‌వుతోంది. రియాల్టి, ఫార్మా, ఐటీ రంగాల సూచీలు దాదాపు ఒక శాతం క్షీణించాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు దారుణంగా క్షీణించ‌డంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, జీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, కోల్ ఇండియా ఉన్నాయి.  ఇక న‌ష్టాల్లో ఉన్న షేర్ల‌లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌, హిందుస్థాన్ లీవ‌ర్‌, స‌న్‌ఫార్మా, విప్రో, ఎస్ బ్యాంక్ ఉన్నాయి. రుచి సోయా కొనేందుకు ప‌తంజ‌లి ఆస‌క్తి చూపుతోంద‌న్న వార్త‌ల‌తో ఆ షేర్ దాదాపు ప‌ది శాతం పెరిగింది.