నిలకడగా ప్రారంభమైన మార్కెట్‌

నిలకడగా ప్రారంభమైన మార్కెట్‌

ఆర్‌బీఐ క్రెడిట్‌ పాలసీ ప్రకటన నేపథ్యంలో మార్కెట్‌ నిలకడగా ప్రారంభమైంది. క్రితం ముగింపు వద్దే సూచీలు కదలాడుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లలో పెద్ద కదలికలు లేవు. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కన్పిస్తోంది. జపాన్‌, హాంగ్‌కాంగ్‌ వంటి కీలక మార్కెట్లు గ్రీన్‌లోనే ఉన్నా.. లాభాలు నామమాత్రంగానే ఉన్నాయి. మన మార్కెట్లు మిడ్‌ సెషన్‌ వరకు అంటే క్రెడిట్‌ పాలసీ నిర్ణయం వచ్చే వరకు నీరసంగా ఉండొచ్చు. వడ్డీ రేట్లను పెంచవచ్చని మార్కెట్‌లోని ఓ వర్గం భావిస్తోంది. గత కొన్ని రోజులుగా చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బ్యాంకర్లు కూడా వడ్డీ రేట్లను నామమాత్రంగానైనా పెంచుతారనే అంటున్నారు. కాని ప్రస్తుతానికి పెంచకపోవచ్చని.. ఈ నిర్ణయాన్ని ఆగస్టు నెలకు వాయిదా వేయొచ్చని వీరు చెబుతున్నారు. ఇవాళ కూడా చిన్న షేర్ల సూచీ 0.8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు ముందున్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో టెక్‌ మహీంద్రా ముందుంది. సిప్లా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌ షేర్లు ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి.