ముదురుతున్న‌ వాణిజ్య యుద్ధం

ముదురుతున్న‌ వాణిజ్య యుద్ధం

అగ్ర‌రాజ్య మ‌ధ్య సాధార‌ణంగా మొద‌లైన వాణిజ్య యుద్ధం ఇపుడు ఇగోల మ‌ధ్య యుద్ధంగా మారింది. స్వ‌దేశీ మంత్ర జ‌పం చేస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.. దేశీయ ప‌రిశ్ర‌మ‌ల ర‌క్ష‌ణ కోస‌మంటూ.. విదేశీ వ‌స్తువులపై సుంకం విధిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇది సాధార‌ణ హెచ్చ‌రికేన‌ని ప్ర‌పంచ దేశాలు కొట్టిపారేశాయి. చెప్పిన‌ట్లే సుంకాలు విధించ‌డం మొద‌లు పెట్ట‌డంతో ట్రంప్ మాట‌లను సీరియ‌స్‌గా తీసుకున్నాయి ప్ర‌పంచ దేశాలు. ఇత‌ర దేశాల సంగ‌తేమోగాని... చైనాపై ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రారంభించేస‌రికి మొత్తం ప్ర‌పంచ దేశాల స్టాక్ మార్కెట్లు స్పందించ‌డం మొద‌లుపెట్టాయి. చైనా నుంచి దిగుమ‌తి అయ్యే 20,000 కోట్ల డాల‌ర్ల విలువైన వ‌స్తువుల‌పై ప‌ది శాతం సుంకం అద‌నంగా వేస్తాన‌ని ట్రంప్ హెచ్చ‌రించారు. చైనా ప్రాధాయ ప‌డుతుందని, కాళ్ళ బేరానికి వ‌స్తుంద‌ని ట్రంప్ భావించారు. కాని చైనా చాలా గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చింది. ఇలా ర‌క్ష‌ణాత్మ‌క విధానాలు మొద‌లు పెడితే తాము ఊరుకోమ‌ని, అదే స్థాయిలో స్పందిస్తామ‌ని హెచ్చ‌రించింది. రెండు దేశాల మ‌ధ్య ఈ గొడ‌వ మొద‌లైనప్ప‌టి నుంచి ప్ర‌పంచ స్టాక్ మార్కెట్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇదేదో స‌ద్దు మ‌ణిగింద‌ని భావిస్తున్న త‌రుణంలో ట్రంప్ మ‌రో బాంబు పేల్చారు. చైనా త‌న మాట విన‌డం లేద‌ని,ఇక ఊరుకునేది లేద‌ని 20,000 కోట్ల డాల‌ర్ల చైనా వ‌స్తువుల దిగుమ‌తుల‌పై ఏకంగా 25 శాతం ప‌న్ను విధిస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో మ‌రోసారి ఈ వివాదం తార స్థాయికి చేరింది. నిన్న మొద‌లైన ఈ గొడ‌వ ఇవాళ మ‌రింత ముదిరింది. దీంతో ఆసియా మార్కెట్లు ఇవాళ తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. దాదాపు మూడు శాతం వ‌ర‌కు కొన్ని సూచీలు క్షీణించాయి. హాంగ్ కాంగ్ సేర్ల సూచీ రెండు  శాతం ప‌డిపోగా... జ‌పాన్ నిక్కీ ఒక శాతం క్షీణించింది. త‌ర‌వాత మొద‌లైన యూరో మార్క‌ట్ల‌దీ అదే స్థితి.  తాజా స‌మాచారం మేర‌కు జ‌ర్మ‌నీ డాక్స్‌తోపాటు ప‌లు కీల‌క  సూచీలు రెండు శాతం దాకా క్షీణించాయి. మ‌రోవైప డాల‌ర్ మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. డాల‌ర్ ఇండెక్స్ 95కు ద‌గ్గ‌ర‌వుతోంది.దీంతో ఇత‌ర క‌రెన్సీల ప‌రిస్థితి ద‌య‌నీంగా మారుతోంది. మ‌న ఆర్బీఐ అన్న‌ట్లు వాణిజ్య యుద్ధం ఇక క‌రెన్సీ వార్ కు దారితీసే ప‌రిస్థితులు స్ప‌ష్టంగా క‌న్పిస్తున్నాయి. డాల‌ర్ పెరిగినా.. ముడి చ‌మురు పెర‌గ‌డం కూడా వ‌ర్ధ‌మాన దేశాల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. వెర‌శి అమెరికా, చైనాల మ‌ధ్య జ‌రుగుతున్న వాణిజ్య యుద్ధం పేద‌, వ‌ర్ధ‌మాన దేశాల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.