నష్టాల్లో ముగిసిన నిఫ్టి
12000 పాయింట్ల వద్ద నిఫ్టికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన నిఫ్టి... 12 వేలను దాటి బలంగా ముందుకు పోలేకపోతోంది. బడ్జెట్ ఇంకా 25 రోజులు ఉండటంతో... అప్పటి దాకా ర్యాలీ కొనసాగించడం కష్టంగా కన్పిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లు దాదాపు అన్ని ప్రపంచ మార్కెట్లను కంగారు పెట్టిస్తున్నాయి. ఈ అనిశ్చితితో పాటు ప్రపంచంలో ఏ మూల కూడా అభివృద్ధి పెరుగుతున్న ఆనవాళ్ళు కన్పించడం లేదు. అమెరికా ఆర్థిక పరిస్థితే దిగజారుతోంది. అందుకే వడ్డీ రేట్లను తగ్గించమని ఫెడరల్ రిజర్వ్‌ను దాదాపు బెదిరించే ధోరణిలో ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన మార్కెట్లలో వరుసగా పాతిక రోజుల ర్యాలీ కష్టంగా కన్పిస్తోంది. పైగా వారపు కాంట్రాక్ట్‌లు వచ్చాక.. ట్రేడింగ్ ధోరణి మారిపోయింది. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఇవాళ ఓపెనింగ్‌లో కేవలం 3 పాయింట్ల నష్టంతో 11962 వద్ద ప్రారంభమైన నిఫ్టిలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఒకదశలో నిఫ్టి 11866కి పడిపోయింది. మిడ్ సెషన్లో యూరో మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలకు పరిమితం కావడంతో మన మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లు కాస్త రికవరయ్యాయి. దీంతో నిఫ్టి 11962 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ్టికి ఇదే గరిష్ఠ స్థాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టాటా స్టీల్, గెయిల్, ఓఎన్జీసీ, వేదాంత, టీసీఎస్ ఉన్నాయి. టాప్ లూజర్స్‌గా ముగిసిన నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, హీరో మోటో కార్ప్ షేర్లు ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ షేర్లలో టాప్ గెయినర్స్‌గా ముగిసిన షేర్లు... డీసీఎం శ్రీరామ్, జీఎస్పీఎల్, దీవాన్ హౌసింగ్, మదర్సన్ సుమి, పీఎన్సీ ఇన్ఫ్రా.
సెన్సెక్స్ టాప్ లూజర్స్‌గా ముగిసిన షేర్లు... ఇండియా బుల్స్ లిమిటెడ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జైన్ ఇరిగేషన్ షేర్లు ఉన్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)