భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

బడ్జెట్‌ తరవాత మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు కూడా ప్రతికూలంగా ఉండటంతో దాదాపు అన్ని రంగాల షేర్లను ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. ఇప్పటికే మార్కెట్‌ గరిష్ఠ స్థాయిలో ఉండటం, బడ్జెట్‌ అంచనాలకు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు తెగ అమ్ముతున్నారు. బడ్జెట్‌ బ్యాంకులకు చాలా అనుకూలమని విశ్లేషకులు అంటున్నా... ఇవాళ బ్యాంకు షేర్లలో కూడా భారీ ఒత్తిడి వచ్చింది. నిఫ్టి బ్యాంక్‌ ఇండెక్స్‌ ఏకంగా 656 పాయింట్లు నష్టపోయిందంటే... మార్కెట్‌లో అమ్మకాల వెల్లువ ఎలా ఉందో అర్థమౌతుంది. ఒక్క ఎస్‌బీఐ షేర్‌ రూ. 12 పైగా నష్టపోయింది. ఒక్క ఐటీ కౌంటర్లు మినహా మిగిలిన కౌంటర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి వస్తోంది. తాజా సమాచారం ప్రకారం నిఫ్టి 179 పాయింట్ల నష్టంతో 11631 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 573 పాయింట్లు క్షీణించింది. శుక్రవారం అమెరికా లో నాన్‌ ఫార్మా జాబ్స్‌ డేటా చాలా సానుకూలంగా వచ్చింది. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లాయి. డాలర్‌ బలపడింది. దీంతో ఆసియా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.