యుకె పౌరసేవ సంస్థలకు లేబర్ పార్టీ దెబ్బ

యుకె పౌరసేవ సంస్థలకు లేబర్ పార్టీ దెబ్బ

యుకె స్టాక్ మార్కెట్లను సోషలిజమ్ దెయ్యం మరోసారి వెంటాడుతోంది. మంచినీటి సరఫరా సంస్థలు సెవెర్న్ ట్రెంట్, యునైటెడ్ యుటిలిటీస్ కి గట్టి దెబ్బ తగిలింది. సోమవారం సెలవు తర్వాత లండన్ మార్కెట్ ప్రారంభం కాగానే ఈ రెండు సంస్థల షేర్లు దారుణంగా పతనమయ్యాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము గెలిస్తే పౌరసేవలను తిరిగి ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకొచ్చేందుకు లేబర్ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆదివారం వార్తాపత్రికల్లో వచ్చిన సవివరమైన కథనంతో పౌరసేవ సంస్థల షేర్లు పాతాళానికి పడిపోయాయి. 

యుకె అంతటా ఉన్న మంచినీటి సరఫరా పరిశ్రమను జాతీయం చేయాలని సూచిస్తూ పార్టీ సీనియర్ నేతలు తయారుచేసిన ముసాయిదా పత్రాన్ని ఉటంకిస్తూ ద సండే టైమ్స్ వార్తాకథనం ప్రచురించింది. 2015లో జెరెమీ కార్బిన్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత లేబర్ పార్టీ అధికారికంగా ఈ విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న యజమానుల నుంచి బలవంతంగానైనా లాక్కొనేందుకు లేబర్ పార్టీ గట్టి పట్టుదలతో ఉందని ఆ వార్తలో పేర్కొన్నారు. ఆయా సంస్థలకు ఇచ్చే నష్టపరిహారం 20 బిలియన్ పౌండ్లకు మించరాదని ఆ పత్రం సూచించింది. యుకెకి చెందిన నీటి నియంత్రణ సంస్థ ఆఫ్ వాట్ తన చివరి సమీక్షలో మంచినీటి పరిశ్రమ ఆస్తులు 73 బిలియన్ పౌండ్లుగా లెక్కగట్టింది. 

1990ల నుంచి యుకెలో ఇంధన సేవాసంస్థల మాదిరిగా మంచినీటి కంపెనీలు చాలా వరకు ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో ఆ సంస్థలు సమర్థంగా నడుస్తాయని అప్పటి కన్జర్వేటివ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సివిటీ కన్సల్టింగ్ సంస్థ అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్, జర్మన్ వినియోగదారులతో పోలిస్తే బ్రిటన్ దేశస్థులు మంచినీటికి 30 శాతం తక్కువ చెల్లిస్తున్నారు. యుకెలో ఐదో వంతు నీటి సరఫరా లీకేజీ నష్టాల్లో పోతోంది.