గజ తుపానుతో అప్రమత్తమైన తమిళనాడు

 గజ తుపానుతో అప్రమత్తమైన తమిళనాడు

గజ తుపాను నేడు తీరం దాటనుంది. ప్రస్తుతం చెన్నై నుంచి 490, నాగై నుంచి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెన్నైలోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఈరోజు సాయంత్రం కడలూరు - పాంబన్ మధ్య తీరం దాటనుందని.. కారైక్కల్, తిరువారూరు, తంజావూరు, కడలూరు, నాగపట్టణం, పుదుకోట, రామనాథపురం జిల్లాల్లో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. 

తుపాను ముందస్తు చర్యల్లో భాగంగా కడలూరు, నాగై, తిరువారూరు, రామనాథపురం, పుదుకోట, కారైక్కాల్‌ జిల్లాల్లోని విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలతో తూర్పు నావికాదళం అప్రమత్తమైంది. సముద్ర తీరంలో ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌, కంజార్‌ యుద్ధ నౌకలతో పాటు హెలికాప్టర్లను సిద్ధం చేసింది. తుపాను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.