చెత్తకుండీ అందించిన పుత్తడిబొమ్మ

చెత్తకుండీ అందించిన పుత్తడిబొమ్మ

కాకి బావ, నక్క బావ కథలు విన్నాం. అవి ప్రదర్శించే తెలివితేటల్ని మన జీవితాల్లో అన్వయించుకున్నాం. ఎంతో కొంత సమయస్ఫూర్తి నేర్చుకున్నాం. అయితే మనుషుల్లా మాటలు నేర్వకపోయినా, జంతువుల్లా తెలివితేటలు చూపించకపోయినా.. భౌతికంగా కదలలేని చెత్తకుండీకి కూడా మనసనేది ఒకటుంటే... దాని భావాలెలా ఉంటాయో ఓసారి ఊహించుకోమంటున్న యథార్థ సంఘటన ఇది. 

అసోంలోని తీన్ సుఖియా జిల్లాలో ఓ చెత్తకుండీ.. కింది ఫొటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయిని పదిలంగా ఓ అయ్య చేతిలో పెట్టింది. ఇది పాతికేళ్ల క్రితం నాటి మాట. ఆ రోజు ఏం జరిగిందంటే... తీన్ సుఖియాలో తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకునే సోబరన్ అనే యువకుడు.. పని పూర్తి చేసుకొని ఇంటికి తిరుగు పయనమయ్యాడు. అప్పటికే చీకటి పడడంతో గబగబా బండిని తోసుకుంటూ వడివడిగా అడుగులు వేస్తున్నాడు. గుబురుగా చెట్లతో మనుషుల అలికిడి లేని నిర్మానుష్య ప్రాంతం వచ్చేటప్పటికి సోబరన్ కు ఓ పసిపాప ఏడుపు వినిపించింది. అడుగులు పడుతున్నకొద్దీ ఏడుపు శబ్దం ఇంకా పెరుగుతోంది. దగ్గరగా వెళ్లాక రోడ్డు పక్కనే ఉన్న చెత్తకుండీ లోంచి ఏడుపు శబ్దం వస్తున్నట్టు అర్థమైంది. కాసేపు పరికించి చూసినా అక్కడ మనుషులెవరూ కనిపించకపోయేసరికి చెత్తకుండీ దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ కుండీలో పాతగుడ్డలు, పేపర్ల మధ్య అందమైన పసిపాప గుక్కపెడుతూ ఏడుస్తోంది. వణుకుతున్న చేతులు చాచి ఆ పాపను తీసుకున్నాడు. ఉద్విగ్నమైన హృదయంతో ఇంటికి తెచ్చుకున్నాడు. అమ్మా-నాన్నా తానే అయి అల్లారుముద్దుగా పాపను పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయంతో సోబరన్ ఇక జీవితంలో పెళ్లి కూడా చేసుకోలేదు. ఆ పాపకు జ్యోతి అని అర్థవంతమైన పేరు పెట్టాడు. సోబరన్ పెళ్లి కాకుండానే జ్యోతికి తల్లీ, తండ్రీ అయిపోయాడు. 

పాతికేళ్ల తపస్సు లాంటి కృషి తరువాత ఆ జ్యోతి.. అసోం పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అయింది. కూరగాయలమ్మే అనామకుడైన సోబరన్ ని ఓ ప్రభుత్వ ఉన్నతోద్యోగి తండ్రిగా ప్రపంచానికి పరిచయం చేసింది. అసోంలోని పత్రికలు, మీడియా సోబరన్ కృషి మీద ప్రత్యేక కథనాలు వండి వార్చాయి.

జ్యోతిని స్కూలుకు పంపడం ఒక్కటే కాదు.. జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చేందుకు ఎంత చేయాలో అంతా చేశాడు. ఓ పూట తనకు లేకపోయినా కూతురు కోసం ఆకలిని భరించాడు. తను చిరిగిన దుస్తులు వేసుకున్నా కూతురుకు మేలైన దుస్తులు కొని పెట్టాడు. కూతురు ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్నకొద్దీ కష్టాలను ఆనందంగా అనుభవించాడు. ఫలితంగా 2013లో జ్యోతి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పట్టా పొందింది. 2014లో అసోం పబ్లిక్ సర్విస్ కమిషన్ పరీక్షలకు హాజరై ఇంటర్వ్యూలో మెప్పించింది. దీంతో ఆమెను ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది.

సోబరన్ కళ్ల నుంచి వటవటా రాలుతున్నాయి.. ఆనంద బాష్పాలు. ఏ లక్ష్యం కోసం, ఏ ఆనందం కోసం తాను సొంత జీవితాన్ని వదులుకున్నాడో అంతకన్నా అందమైన జీవితానుభవాన్ని, అనంతమైన తృప్తిని తన కూతురు జ్యోతి అందించినందుకు సోబరన్ కళ్లు హృదయపు తడితో మెరిసిపోతున్నాయి. ప్రపంచమంతా చీదరించుకునే చెత్తకుండీ ఓ కూరగాయలు అమ్ముకునే అనామకుడి మీద దయ చూపించడం ఏమిటి? తన కడుపులో పదిలంగా దాచుకున్న అద్భుతమైన, అందమైన వజ్రం బాధ్యతలు తనకు అప్పగించడం ఏమిటి? ఒక్కసారిగా ప్రపంచం దృష్టి తనవైపు తిరిగేలా చేసిన ఆ చెత్తకుండీకి సోబరన్ ఏమని కృతజ్ఞతలు చెప్పుకోగలడు? ఓ రెండు కన్నీటి బొట్లు తప్ప.