గాయంతో ఫార్మాసిస్టు వద్దకు వెళ్లిన కుక్క

గాయంతో ఫార్మాసిస్టు వద్దకు వెళ్లిన కుక్క

టర్కీలోని ఇస్తాంబుల్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం ఓ వీధి కుక్క కాలికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అది దగ్గర్లోనే ఉన్న ఫార్మసీలోకి పరిగెత్తింది. చికిత్స చేయాలన్నట్లుగా దీనంగా చూస్తూ అక్కడున్న ఫార్మాసిస్టు బానూ సెంగిజ్‌ను వేడుకుంది. వెంటనే బాను ప్రేమగా దానిని దగ్గరకు తీసుకుని చికిత్స చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ప్రేమగా చేతిని తాకి తనదైన భాషలో ఆ కుక్క బానుకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 10లక్షల పైచిలుకు మంది వీక్షించగా.. లక్ష పైచిలుకు లైక్స్ వచ్చాయి. 15వేల మంది దీన్ని రీట్వీట్ చేశారు. ‘ మీరు చేసిన పని మా మనస్సును గెలుచుకుంది. మూగజీవాల పట్ల ప్రేమ చూపాల్సిన ఆవశ్యకతను మరోసారి తెలియజేశారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.