మళ్లీ మోడీ అనుమానమే!!

మళ్లీ మోడీ అనుమానమే!!

బీజేపీకి 230, అంత కంటే తక్కువ సీట్లు వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం కష్టమేనని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. హఫ్ పోస్ట్ ఇండియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఒకవేళ బీజేపీ సాధించే సీట్ల సంఖ్య 220 లేదా 230 దగ్గర ఆగిపోతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సీట్లు మరో 30 ఉంటాయి. అంటే మొత్తంగా 250 సీట్లు గ్యారంటీగా వస్తాయి. అధికారం చేపట్టాలంటే మరో 30 సీట్లు సాధించాల్సి ఉంటుందని' స్వామి అన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తితే మోడీ ప్రధానమంత్రి అవుతారా అని అడిగితే 'అప్పుడు అదంతా మిగతా భాగస్వాములపై ఆధారపడి ఉంటుంది. అదనంగా అవసరమయ్యే 30 లేదా 40 సీట్లు కలిగినవాళ్లు-వాళ్లు వద్దంటే ఆయనను అంగీకరించలేము' అని స్పష్టం చేశారు. 

'బిజూ జనతాదళ్ అధినేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయనకి రెండో అవకాశం ఇవ్వరాదని ఇప్పటికే ప్రకటించారు. మాయావతిని కూడా తీసుకు రావాల్సి ఉంటుంది. ఆమె తన మనసులో ఏముందో బయటికి చెప్పలేదు. బీఎస్పీ ఎన్డీఏలో చేరవచ్చు. ఆమె నాయకత్వంలో మార్పు కోరితే నేను ఎంత మాత్రం ఆశ్చర్యపోనని' సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. అప్పుడు మోడీ స్థానాన్ని నితిన్ గడ్కరీ భర్తీ చేయగలరా అన్న ప్రశ్నకు స్వామి 'ఆయన వస్తే చాలా బాగుంటుంది. ఆయన అర్హుడు. మోడీ మాదిరిగానే సమర్థుడు' అని తెలిపారు.