సమ్మిట్.. ప్రపంచంలో ఇదే సూపర్ కంప్యూటర్

సమ్మిట్.. ప్రపంచంలో ఇదే సూపర్ కంప్యూటర్

అమెరికా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్.. సమ్మిట్ ను ఆవిష్కరించారు. ఇప్పటి వరకు ఉన్న సూపర్ కంప్యూటర్.. టైటాన్ తో పోలిస్తే ఇది ఎనిమిది రెట్లు ఎక్కువ వేగంతో పని చేస్తుంది. ప్రసిద్ధ కంప్యూటర్ తయారీ సంస్థ, ఐబీఎం సహకారంతో అమెరికా ఇంధన శాఖకు చెందిన ఓక్ రిడ్జ్ నేషనల్ లేబరేటరీ (ఓఆర్ఎన్ఎల్) ఈ సూపర్ కంప్యూటర్ ను తయారు చేసింది. దీంతో ఇంధన, ఆధునిక పదార్థాలు, కృత్రిమ మేధస్సు రంగాల్లో మునుపెన్నడూ లేనంత వేగంగా గణనలు చేయడం సాధ్యమవుతుంది.

సమ్మిట్ ఇంటర్నల్ మెమెరీ 25 కోట్ల జీబీలు. వేగం సెకన్‌కు 200 పెటాఫ్లాప్స్. ఈ సూపర్ కంప్యూటర్ సెకన్‌కు రెండు లక్షల ట్రిలియన్ల లెక్కలు చేయగలదు. ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు కాగా సెకనుకు రెండు లక్షల కోట్ల లెక్కలంటే దీని వేగాన్ని అంచనా వేసుకోవచ్చు. కొన్ని రకాల పరిశోధన విభాగాల్లో సెకన్‌కు మూడు బిలియన్‌ బిలియన్ల (300 కోట్ల కోట్ల) మిశ్రమ గణనలు, విశ్లేషణలను కూడా చేయగలగడం దీని ప్రత్యేకత. అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ల కారణంగా సమ్మిట్ ఏకకాలంలో 10లక్షల జీబీ (10 పెటాబైట్స్) కన్నా ఎక్కువ డేటా ప్రాసెస్ చేయగలదు. 

దీని నిర్మాణంలో ఐబీఎం సంస్థకు చెందిన 4,608 అత్యాధునిక సర్వర్లను వినియోగించారు. ఒక్కో సర్వర్‌లో రెండు 22 కోర్ ఐబీఎం పవర్-9 ప్రాసెసర్లను, ఆరు ఎన్‌వీఐడీఐఏ టెల్సా వీ-100 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ యాక్సిలరేషన్స్‌ను ఉపయోగించారు. వీటన్నింటినీ డ్యుయల్-రైల్ మెల్లనోక్స్ ఈడీఆర్ 100 జీబీ/సెకన్ ఇన్ఫినిబాండ్‌తో అనుసంధానించారు.

ఓఆర్‌ఎన్‌ఎల్, ఐబీఎం కలిసి 2012లో టైటాన్ సూపర్ కంప్యూటర్‌ను తయారుచేశాయి. దీని సామర్థ్యం 27 పెటాఫ్లాప్స్. ఇది ఇప్పటివరకు అమెరికాలోనే వేగవంతమైన సూపర్‌కంప్యూటర్. తాజాగా ఆవిష్కరించిన సమిట్ టైటాన్ కన్నా ఎనిమిది రెట్లు శక్తివంతమైనది. బయోఎనర్జీ, మానవ ఆరోగ్యానికి సంబంధించిన 1.8 బిలియన్ బిలియన్ల జన్యు సంబంధ సమాచారాన్ని సమిట్‌కు అందించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. 

సమిట్ శాస్త్ర పరిశోధనలకు సహాయపడటమే కాకుండా, తనలోని కృత్రిమ మేధస్సును(ఏఐ) నూతన ఆవిష్కరణల్లో భాగస్వామిని చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దీంతో మానవ ఆరోగ్యం, హైఎనర్జీ ఫిజిక్స్, మెటీరియల్స్ డిస్కవరీ తదితర రంగాల్లో ఆవిష్కరణల వేగం పెరుగుతుందని చెప్పారు. విశ్లేషణ శక్తి, సమాచార నిల్వ, ప్రాసెసింగ్ లలో అపార సామర్థ్యం గల సమ్మిట్ ద్వారా పరిశోధకులు అత్యంత కచ్చితమైన ఫలితాలను మరింత వేగంగా పొందగలుగుతారని ఓఆర్‌ఎన్‌ఎల్ అసోసియేట్ డైరెక్టర్ జెఫ్ నికోల్స్ తెలిపారు. సమిట్‌లోని కృత్రిమ మేధస్సుతో తక్కువ కాలంలో, వివిధ కోణాల్లో విశ్లేషించవచ్చని చెప్పారు.