టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న గవాస్కర్...

టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న గవాస్కర్...

1970లో క్రికెట్‌ సూపర్‌స్టార్‌.  భారత బ్యాటింగ్‌ దిగ్గజం..! లిటిల్‌ మాస్టర్‌ కెరీర్‌లో టన్నుల కొద్దీ పరుగులు.. మరెన్నో రికార్డులు. సునీల్‌ గవాస్కర్‌.. క్రికెట్‌ అభిమానులు ఇష్టంగా పిలుచుకునే సన్నీ.. క్రికెట్‌లోకి అడుగుపెట్టి 50 ఏళ్లు గడిచిపోయాయి. 1971 మార్చి 6న విండీస్‌తో క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా మొతేరాలో గవాస్కర్‌ను బీసీసీఐ సత్కరించింది. 

భారత క్రికెట్‌కి 1970లోనే గుర్తింపు తీసుకొచ్చిన బ్యాట్స్‌మెన్‌ సునీల్‌ గవాస్కర్‌. లిటిల్‌ మాస్టర్‌ వచ్చి రావడంతోనే పరుగుల వరద సృష్టించాడు. ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. గవాస్కర్‌ సృష్టించిన ఎన్నో రికార్డులను సచిన్‌ టెండూల్కర్‌ తిరగరాశాడు. టెస్టుల్లో సన్నీ బ్యాటింగ్‌ స్టైల్‌ను ఇష్టపడే అభిమానులు ఎందరో ఉన్నారు. 

ఈ టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం, భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు. 1971 వెస్టిండీస్‌ పర్యటనలో అరంగేట్రం చేసిన సన్నీ తర్వాత మేటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వరుస రికార్డులతో ప్రపంచ క్రికెట్‌లోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అలా 16 ఏళ్ల పాటు టీమ్‌ ఇండియాకు ఎనలేని సేవలందించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు లిటిల్‌ మాస్టర్‌. తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 67 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో సన్నీ ఏకంగా 774 పరుగులు చేశాడు. ఎంట్రీ ఇచ్చిన సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్‌ సృష్టించాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా దక్కించుకుంది. 

ఇక బీసీసీఐ సైతం గావస్కర్‌ను ప్రత్యేకంగా సత్కరించింది. క్రికెట్‌ ప్రపంచంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెక్రటరీ జై షా ఓ జ్ఞాపికను అందజేశారు. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడోరోజు లంచ్‌ టైమ్‌లో సన్నీని ఘనంగా సన్మానించారు. 

సన్నీ కెరీర్‌లో ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాయిలు ఉన్నాయి. టెస్ట్‌ క్రికెట్‌లో పది వేల పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌ మెన్‌ సునీల్‌ గవాస్కర్‌. మొతేరా స్టేడియంలోనే ఈ రేర్‌ ఫీట్‌ సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కూడా నెలకొల్పాడు. దానిని సచిన్‌ బ్రేక్‌ చేశాడు. 1987లో పాకిస్తాన్‌తో చివరి మ్యాచ్‌ ఆడాడు సునీల్‌ గవాస్కర్‌. 125 టెస్ట్‌ల్లో 10,122 పరుగులు చేయగా.. 108 వన్డేలు ఆడిన సన్నీ 3092 పరుగులు చేశాడు. 

ఈ సందర్భంగా మాజీలు కూడా సన్నీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.  గవాస్కర్‌ తమను గర్వపడేలా చేసి మార్గనిర్దేశం చేశారని సచిన్‌ ట్వీట్‌ చేశారు. శుభాకాంక్షలు చెప్పారు. సన్నీ రిటైర్‌ అయినా.. క్రికెట్‌కి మాత్రం దూరం కాలేదు. వ్యాఖ్యాతగా ఆయన మాటలు మ్యాచ్‌ల్లో వినిపిస్తూనే ఉన్నాయి. 2014లో స్వల్ప కాలం పాటు ఆయన బీసీసీఐ ప్రెసిడెంట్‌గానూ సేవలు అందించాడు.