గావస్కర్‌కు అందని ఆహ్వానం

గావస్కర్‌కు అందని ఆహ్వానం

బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ప్రదానోత్సవానికి భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ఆహ్వానం పంపలేదు. దీంతో గావస్కర్‌ తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగు టెస్టు సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్టును భారత్ గెలిచినా, ఓడినా ట్రోఫీ మాత్రం భారత జట్టుతోనే ఉండనుంది. దిగ్గజాల పేరిట ఏర్పాటు చేసిన ఈ ట్రోఫీని గవాస్కర్ లేకుండానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అందుకోనున్నాడు. 

ట్రోఫీని బహుకరించడం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున జేమ్స్ సదర్‌లాండ్ గత మే నెలలో గవాస్కర్‌కు లేఖ రాశారు. దీనికి గవాస్కర్ వస్తానంటూ బదులిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం సీఏ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు. మరోవైపు ఆహ్వానం పంపిన సదర్‌లాండ్ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా సీఏ సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అధికారికంగా సీఏ ఆహ్వానం పంపినా.. వెళ్లే పరిస్థితిలో గవాస్కర్ లేరు. సన్నీ ‘సోనీ నెట్‌వర్క్‌’తో ఒప్పందం చేసుకోవడమే దీనికి కారణం.

సీఏ గావస్కర్‌కు ఆహ్వానం పంపకపోవడం మొదటిసారి కాదు. 2015లో చివరిలో ఆహ్వానించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సన్నీ హాజరయ్యారు. 2007 - 08లోనూ ఇలాగే చేసింది. ఇక 2000లో ఆస్ట్రేలియా శతాబ్ది జట్టును ఎంపిక చేసేందుకు సీఏ గావస్కర్‌ను ఆ ప్యానెల్‌లో సెలెక్టర్‌గా నియమించింది కానీ వేడుకకి మాత్రం పిలవలేదు. టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని బోర్డర్, గవాస్కర్ లు మొదటగా అందుకున్నారు. దీనికి గుర్తుగా 1996 నుంచి బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు.