మిస్టర్ కూల్‌పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

మిస్టర్ కూల్‌పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ భవితవ్యంపై రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. అతడి రిటైర్మెంట్‌పై అనేక వార్తలు వినిపిస్తున్న క్రమంలో లెజెండరీ బ్యాట్స్‌మన్‌, మాజీ సారథి సునీల్‌గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ధోనీ రిటైరయ్యే సమయం ఆసన్నమైందని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అతడి మీదున్న గౌరవంతో చెబుతున్నా.. ధోనీ టైమ్‌ అయిపోయిందంటూ కామెంట్‌ చేశారు సునీల్‌ గవాస్కర్‌. భవిష్యత్‌పై టీమిండియా దృష్టి సారించాలని, అయితే.. ధోనీని జట్టు సాగనంపకముందే.. అతడే వెళ్లిపోతాడని భావిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు గవాస్కర్‌. 

మరోవైపు దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు టీమిండియాని ప్రకటించిన వేళ ధోనీ భవితవ్యంపై సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ను మీడియా వివరణ కోరగా.. ధోనీ రిటైర్మెంట్‌పై ఎలాంటి సమాచారం లేదని చెప్పాడు. అలాగే ప్రచారంలో ఉన్నా... ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. అలాగే కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ స్పందిస్తూ ధోనీకి మద్దతుగా నిలిచాడు. ధోనీ అనుభవం టీమిండియాకు ఎంతో ఉపయోగమని, అతడు యువ ఆటగాళ్లకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడని తెలిపాడు.